పశువుల దవాఖాన దుస్థితి.. రైతుల ఆందోళన
డాక్టర్ల కొరతతో చికిత్సకు ఇబ్బందులు.. శిథిలావస్థలో భవనం
ఊర్కొండ, ఆంధ్రప్రభ: నాగర్కర్నూల్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ మండల పరిధిలో ఉన్న ఊర్కొండపేట పశువుల దవాఖాన పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు డాక్టర్ల కొరత, మరోవైపు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పశువైద్య సేవలు సక్రమంగా అందడం లేదని వారు చెబుతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో కూడా ఒక్క డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో పశువులకు సకాలంలో చికిత్స అందించడం కష్టంగా మారిందని రైతులు తెలిపారు. దీంతో పశువుల ఆరోగ్యం దెబ్బతింటూ ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.
దవాఖాన భవనం పాతబడిపోయి గోడలకు పగుళ్లు ఏర్పడటంతో పాటు రంగు వెలిసిపోయి అధ్వానంగా మారిందని స్థానికులు పేర్కొన్నారు. భవనం శిథిలావస్థలో ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.
సిబ్బంది లేకపోవడం, భవనం దెబ్బతినడం వల్ల దవాఖాన పేరుకే పరిమితమైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఊర్కొండపేటతో పాటు చుట్టుపక్కల పది కంటే ఎక్కువ గ్రామాల రైతులు ఈ దవాఖానపైనే ఆధారపడుతున్నందున సమస్య మరింత తీవ్రంగా మారిందని చెప్పారు.
వెంటనే కొత్త పశువైద్యులను నియమించి, దవాఖాన భవనాన్ని మరమ్మతులు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఊర్కొండపేట రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
