Heavy Rains | పొంగిపొర్లుతున్న వాగులు.. నీటమునిగిన పంటపొలాలు..

Heavy Rains | ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ: మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా మంగపేట మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి.

నిరంతర వర్షాల కారణంగా మండలంలోని పలు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. కమలాపురంలోని ఎర్రవాగు, మంగపేటలోని గౌరారం వాగు, రాజుపేటలోని ముసలమ్మవాగు, కప్పవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

బొమ్మాయిగూడెం–కొత్తూరు మొట్లగూడెం మధ్య గౌరారం వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బొమ్మాయిగూడెంకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తాత్కాలికంగా తెగిపోయాయి.

వాగులో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రజలు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరిస్తూ కొత్తూరు మొట్లగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి అజ్మత్, కారోబర్ మోహనకృష్ణ ఆధ్వర్యంలో తాత్కాలిక బారికేడ్లు, హెచ్చరికల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

శనిగకుంట గ్రామ సమీపంలోని కూడలి ఒర్రె ఉద్ధృతి పెరగడంతో బుధవారం ఉదయం నుంచి శనిగకుంటకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్ల చుట్టూ వరద నీరు చేరింది. గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరుతుండటంతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

వరద పరిస్థితుల నేపథ్యంలో మండలంలోని లోతట్టు ప్రాంతాలను తహసీల్దార్ తోట రవీందర్, ఎస్సై టి.వి.ఆర్. సూరి పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.