ఘన వ్యర్థాల నిర్వహణపై చిట్యాల పుర పాలక వర్గానికి శిక్షణ
చెత్త వర్గీకరణ, శాస్త్రీయ నిర్వహణపై అవగాహన
చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించిన ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఘన వ్యర్థాల సేకరణ, నిర్వహణ, కెపాసిటీ బిల్డింగ్ అంశాలపై అవగాహన కల్పించారు.
శిక్షణ ఇచ్చిన నిపుణులు మున్సిపాలిటీల్లో చెత్తను వర్గీకరించడం, తడి చెత్త, పొడి చెత్త సేకరణ విధానాలు, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కౌన్సిలర్లకు వివరించారు.
మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజల్లో అవగాహన పెంచడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని తెలిపారు.
ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలు పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడతాయని చిట్యాల మున్సిపల్ ప్రజాప్రతినిధులు తెలిపారు. వార్డుల్లో ఘన వ్యర్థాల సేకరణను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు నాగిల్ల సుధాకర్ (కావేరి), షేక్ షబానా, గాలి పద్మ, కోనేటి ఎల్లయ్య, జేరిపోతుల సత్యనారాయణ, దేశపాక శ్రీలత, ఏర్పుల పరమేష్, నిమ్మనగోటి శ్రీను, బొబ్బలి సందీప్, కోఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, షహజాది, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
