రైతుల సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలి..
- రీసర్వే ఆకస్మిక తనిఖీలలో రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ డైరెక్టర్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామం, రణస్థలం మండలం సంచం గ్రామాలలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని ఆయన జిల్లా రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమక్షంలో సర్వే జరగడంతో అయన హర్షం వ్యక్తం చేశారు. గత రీసర్వేలలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
సర్వే మొదలు పెట్టేరోజున తప్పనిసరిగా సంబంధిత రైతు లేదా కుటుంబసభ్యులు క్షేత్ర స్థాయిలో ఉండాలని, సర్వే పూర్తయిన తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలన్నారు. రైతు చేతికి సరైన కొలతలతో కూడిన పట్టాదారు పాసుపుస్తకం అందజేసే వరకూ సమాచారం తప్పనిసరిగా అందించేలా చూడాలని అధికారులును ఆదేశించారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ కుర్మనాధ్ మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన రీసర్వే 1. 0 లో భూ సరిహద్దుల నిర్ణయం, భూ వివరాలు తప్పులుగా నమోదవడంతో పాటు జాయింట్ ఎల్పీ నంబర్లు లాంటి చాలా ఇబ్బందులను రైతులు ఎదుర్కొన్నారన్నారు. గతంలో జరిగిన రీసర్వే లో తప్పులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో భూ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు రైతుల సమక్షంలోనే రీసర్వే నిర్వహించే విధంగా రీసర్వే 2.0 నిర్వహిస్తున్నామన్నారు. రీసర్వే నిర్వహించిన తరువాత నోటీసు రూపంలో రైతు చూపించిన భూ హద్దుల ప్రకారం భూ వివరాలను తెలియజేయడం, డాక్యుమెంట్లతో సరిపోల్చుకుని నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. ఈ కేవైసీ చేయించడం ద్వారా రైతు సమక్షంలో సర్వే నిర్వహించడంతో పాటు రైతులకు అన్ని విధాలా సమాచారం అందిస్తూ ఎక్కడా రైతులు ఇబ్బంది పడకుండా చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ హిస్తున్న రీసర్వేల్లో ఫేజ్-1లో 628, ఫేజ్-2 లో 748, ఫేజ్-3 లో 729, ఫేజ్-4 లో 1645 గ్రామాల్లో నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 2,800 బృందాలతో అత్యాధునిక రోవర్స్ తో సర్వే నిర్వహించడం జరుగుతున్నదన్నారు. క్షేత్ర స్థాయిలో భూవివరాలు, డాక్యుమెంట్ పరంగా గల వివరాలను రైతుల సమక్షంలోనే సరిపోల్చుతూ ఇకముందు ఎటు వంటి భూ వివాదాలకు తావులేకుండా రైతులు సంతృప్తి చెందే విధంగా రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఫేజ్-5 లో రాష్ట్ర వ్యాప్తంగా 1, 343 గ్రామాలలో రైతులతో కలిసిమెలిసి క్షేత్రస్థాయిలో రీసర్వే నిర్వహిస్తున్నామన్నామని, రైతులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయిలో సమస్యలెదురైతే తక్షణ పరిష్కారం చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ విధానాల పరంగా 2027 మార్చి నాటికి భూవివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో సహాయ సంచాలకులు ఎం జోషిలా, శ్రీకాకుళం, టెక్కలి డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్లు దుర్గ ప్రసాద్, చంద్ర శేఖర్, ఎచ్చెర్ల, రణస్థలం తహసీల్దార్లు పి గోపాల్ రావు, కిరణ్ కుమార్, సర్వే డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ, సర్వే సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు
