ఎల్‌నినో ప్రభావంతో ఏ రైతూ నష్టపోకూడదు

  • పీఎం ఫసల్ బీమా యోజన కింద 100 శాతం నమోదు చేయాలి
  • గ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
  • వ్యవసాయ, పారిశ్రామిక, రిటైల్ రంగాలకు రుణాల మంజూరులో బ్యాంకులు చొరవ చూపాలి
  • జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

విజయవాడ, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాలో అన్ని ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ఏ ఒక్క రైతు కూడా పీఎం ఫసల్ బీమా యోజన పరిధికి వెలుపల ఉండకుండా 100 శాతం నమోదు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత శాఖల అధికారులను, బ్యాంకర్లను ఆదేశించారు. అలాగే గ్రామీణ మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, స్వయం ఉపాధి అవకాశాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

విజయవాడ కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డుల జారీ, పీఎం ఫసల్ బీమా యోజన నమోదు, మెప్మా, డీఆర్‌డీఏ రుణాల మంజూరు, ఏపీ టిడ్కో గృహాల నిర్మాణ పురోగతి, వార్షిక రుణ ప్రణాళిక అమలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జూలై నెలలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైందని, రానున్న మూడు నెలల్లో కూడా సాధారణ వర్షపాతం కంటే 35 నుంచి 40 శాతం వరకు లోటు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున రైతులకు ముందస్తు సూచనలు అందించి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలోని ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజన పరిధిలోకి వచ్చేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, పీఎం ఫసల్ బీమా యోజన కింద ఈ నెల 31వ తేదీ వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, వరి పంటకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉన్నందున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.