ఈ నెల 31న బార్ అసోసియేషన్ ఎన్నికలు..
హోరా హోరీగా పోటీ..
ప్రచారంలో నిమగ్నమైన అభ్యర్థులు..
నర్సాపురం, ఆంధ్రప్రభ : నర్సాపురం బార్ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారంతో ముగియడంతో కీలక పదవులకు పోటీ ఖరారైంది. అన్ని పదవులను ఏకగ్రీవం చేసేందుకు పెద్దలు చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ తదితర ప్రధాన పదవులకు ఎన్నిక అనివార్యమైంది.
దీంతో బార్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల అధికారి నక్కా కుమారరత్నం బ్యాలెట్‌ను సిద్ధం చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసి సీనియర్ న్యాయవాదులను కలిసి మద్దతు కోరుతున్నారు.
31న ఎన్నికలు
బార్ అసోసియేషన్ 2026–27 ఎన్నికలను ఈ నెల 31న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల అధికారి నక్కా కుమారరత్నం తెలిపారు. సహాయక ఎన్నికల అధికారిగా కొమ్ము నారాయణమూర్తి (బుజ్జి) వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. బార్ అసోసియేషన్‌లో సుమారు 200 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.
మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వారిలో 13 మంది ఉపసంహరించుకున్నారని తెలిపారు. కొన్ని పదవులు మాత్రమే ఏకగ్రీవం కాగా, కీలక పదవులకు పోటీ తప్పలేదన్నారు.
కీలక పదవులకు పోటీ
- అధ్యక్షుడు: నిడుమోలు జ్ఞానానంద, జి. వల్లభరావు
- ఉపాధ్యక్షుడు: ఆర్.జి. కుమార్, ఇంజేటి జాన్ కెనడీ
- జనరల్ సెక్రటరీ: వైదాని నాగేశ్వరరావు, కురేళ్ల సోమశేఖర్, పూరెళ్ల శ్రీనివాస్
- జాయింట్ సెక్రటరీ: అమరేశ్వరరావు, దొంగ సుభాష్‌బాబు
- లైబ్రరీ సెక్రటరీ: రంప పుల్లాజీ, నారిన శ్రీనివాసరావు
- మహిళా ప్రతినిధి: ఎర్రంశెట్టి మాధురి, బొడ్డు ప్రగతి
ఏకగ్రీవంగా ఎన్నికైన వారు
- ట్రెజరర్: తోట సూర్య రాజ్యలక్ష్మి
- స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ: కొల్లా బత్తుల చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఈజే దాస్, కుంచె దుర్గ భవాని, గొట్టుముక్కల అవినాష్ వర్మ, కొప్పల శిరీష, పులపర్తి హర్షవర్ధన్, గోరింకల వినోద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
