ఆయుర్వేద కళాశాల విద్యార్థులకు అస్వస్థత
- 20 మంది విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స
- సెంట్రల్ క్యాంటీన్ ఆహారంపై ప్రాథమిక అనుమానాలు
- ఆహార నాణ్యతపై విచారణ ప్రారంభించిన అధికారులు
తిరుపతి బ్యూరో, (ఆంధ్రప్రభ): నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో ఉంటున్న సుమారు 25 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురికావడంతో టీటీడీ సెంట్రల్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. వివరాలు… ఆయుర్వేద కళాశాల హాస్టల్ విద్యార్థులకు స్విమ్స్ సెంట్రల్ క్యాంటీన్ నుంచి ఆహారం సరఫరా అవుతోంది. ఆహారం తీసుకున్న అనంతరం పలువురు విద్యార్థులకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో 20 మంది బాలికలు, 8 మంది బాలురు ఉన్నారు. వారిలో 17 మంది బాలికలు, ముగ్గురు బాలురను అంబులెన్స్ ద్వారా టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు.
ఫుడ్ పాయిజన్‌పై ప్రాథమిక అనుమానం
విరేచనాలు, వికారం, స్వల్ప కడుపు నొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న 20 మంది విద్యార్థులకు ముఖ్య వైద్యాధికారి పర్యవేక్షణలో తక్షణమే అవసరమైన వైద్య చికిత్స అందించారు. చికిత్సకు విద్యార్థులందరూ సానుకూలంగా స్పందించగా, వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు డిశ్చార్జ్ చేశారు. అనంతరం వారు తిరిగి వసతి గృహాలకు చేరుకుని భోజనం చేశారు. తుది వైద్య నివేదిక ప్రకారం అస్వస్థతకు గురైన విద్యార్థులందరూ ప్రస్తుతం సురక్షితంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
నాణ్యత లేని ఆహారం
ఆయుర్వేద కళాశాల హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత సరిగా లేదని, చాలా రోజులుగా ఇదే సమస్య కొనసాగుతోందని విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ వారి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం స్విమ్స్ సెంట్రల్ కిచెన్‌లో ఆహార తయారీ విధానం, నిల్వ, పంపిణీ, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. వంటశాలలో ఉన్న పరిస్థితులు, ఆహార పదార్థాల వినియోగంపై కూడా తనిఖీలు నిర్వహించారు. ఘటనకు గల అసలు కారణాలను గుర్తించేందుకు ఆహార నమూనాలను పరీక్షలకు పంపించే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. పూర్తి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
స్పందించిన జేఈవో శరత్
ఘటనపై జేఈవో శరత్ స్పందించారు. విద్యార్థులకు స్వల్ప అస్వస్థత లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్య చికిత్స అందించి, వారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా నిలకడలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అంతకు ముందు టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిని సందర్శించిన జేఈవో.. చికిత్స పొందుతున్న విద్యార్థులను స్వయంగా పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు.
