ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.131 కోట్ల విలువైన వైద్య సేవలు

  • రెండేళ్లలో 2,081 ఆర్థో సర్జరీలు, 5,067 ప్రసవాలు
  • రూ.52 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా విస్తరణ
  • ప్రభుత్వ విప్ విజయరమణరావు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండేళ్లలో రూ.131.62 కోట్ల విలువైన వైద్య సేవలు అందించామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రిలో వైద్య సేవలను గణనీయంగా మెరుగుపరిచామని చెప్పారు. రూ.40 లక్షలతో కంటి, దంత, ఆర్థో, ఈఎన్‌టీ, చర్మవ్యాధులు తదితర విభాగాలకు అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

నవజాత శిశువుల సంరక్షణ కోసం ప్రత్యేక ఎస్‌ఎన్‌సీయూను ఏర్పాటు చేసి వార్మర్లు, ఫోటోథెరపీ యూనిట్లు, సీప్యాప్, వెంటిలేటర్ వంటి పరికరాలను సమకూర్చామని పేర్కొన్నారు. గత రెండేళ్లలో 2,081 ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, 6,478 జనరల్ సర్జరీలు, 3,096 కంటి శుక్లాల ఆపరేషన్లు, 216 దంత శస్త్రచికిత్సలు నిర్వహించామని తెలిపారు.

40,923 అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లు, 2,355 ఈకో పరీక్షలు, 32 వేలకుపైగా ఈసీజీ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇదే కాలంలో 5,067 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఓపీ సేవల ద్వారా 5.12 లక్షల మందికి పైగా రోగులకు ఉచితంగా మందులు అందించినట్లు తెలిపారు.

గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, అధిక సంఖ్యలో రోగులు వైద్య సేవల కోసం ప్రభుత్వ దవాఖానను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో జిల్లా ఆసుపత్రిని రూ.52 కోట్ల వ్యయంతో 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా విస్తరిస్తున్నామని తెలిపారు.

నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. తెలంగాణలోని 33 జిల్లా ఆసుపత్రుల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అగ్రస్థానంలో నిలవడానికి కృషి చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీదర్, వైద్యులు, సిబ్బంది, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఆయన అభినందనలు తెలిపారు.

ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీదర్, వైద్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.