Karnataka | బాగల్‌కోట్‌లో దారుణం..

భార్య హత్యతో కలకలం


Karnataka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో ఓ భర్త ఆమెను అత్యంత క్రూరంగా హత్య చేసి, ఆ దృశ్యాలను అత్తమామలకు వీడియో కాల్ ద్వారా చూపించిన ఘటన సంచలనం సృష్టించింది. అనంతరం అదే వీడియోలను స్నేహితులకు పంపి వికృతానందం పొందినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాగల్‌కోట్ జిల్లాకు చెందిన ప్రవీణ్ తన భార్య భాగ్యశ్రీ (23) ప్రవర్తనపై కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే వివాదం ముదరడంతో ప్రవీణ్ కర్రతో భార్యపై దాడి చేశాడు. అనంతరం దుపట్టాతో ఉరివేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

అంతటితో ఆగకుండా, భాగ్యశ్రీ ప్రాణాలతో పోరాడుతున్న సమయంలోనే ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి ఆ దృశ్యాలను చూపించాడు. అనంతరం ఆ వీడియోలను తన స్నేహితులకు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.