Five Headed Snake | ఐదు తలల సర్పాన్ని పోలిన పసుపు కొమ్ము కలకలం

పూజా మందిరంలో ఉంచి ప్రత్యేక పూజలు.. చూసేందుకు తరలివస్తున్న స్థానికులు

Five Headed Snake | కేసముద్రం, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ పసుపు మిల్లులో ఐదు తలల సర్పాన్ని పోలిన ఆకారంలో ఉన్న పసుపు కొమ్ము కనిపించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. ఈ అరుదైన ఆకారాన్ని చూసిన మిల్లు యాజమాన్యం దానిని పూజా మందిరంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించింది.

వివరాల్లోకి వెళ్తే.. కేసముద్రంలోని హరికృష్ణ రైస్ అండ్ పసుపు డోలా మిల్లులో మంగళవారం పసుపు డోలా గ్రేడింగ్ చేస్తున్న సమయంలో కూలీలు ఐదు తలల సర్పాన్ని పోలిన ఆకారంలో ఉన్న పసుపు కొమ్మును గుర్తించారు. అనంతరం దానిని మిల్లు యజమానికి అప్పగించారు.

ఇలాంటి ఆకారంలో ఉన్న పసుపు కొమ్మును గతంలో ఎప్పుడూ చూడలేదని మిల్లు యాజమాన్యం తెలిపింది. దీనిని విశేషంగా భావించిన వారు మిల్లులోని పూజా మందిరంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సహజసిద్ధంగా ఏర్పడిన ఈ పసుపు కొమ్ము గురించి సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో మిల్లుకు చేరుకుని దానిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.