విద్యా సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు
వెదిరె మేఘా రెడ్డికి ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు–2026
మునుగోడు, ఆంధ్రప్రభ: విద్యా రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా వెదిరె ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ వెదిరె మేఘా రెడ్డికి ప్రతిష్టాత్మక ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు–2026 లభించింది.
న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ కాన్ఫరెన్స్ అండ్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డా. సుకాంత మజుందార్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా వెదిరె మేఘా రెడ్డి మాట్లాడుతూ, ఈ అవార్డు తన వ్యక్తిగత విజయమే కాకుండా వెదిరె ఫౌండేషన్ విద్యా రంగంలో అందిస్తున్న సేవలకు దక్కిన గుర్తింపని అన్నారు.
ఈ గుర్తింపు మరింత బాధ్యతను పెంచిందని, ఇదే స్ఫూర్తితో విద్యాభివృద్ధి, సమాజ సేవ కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
తనపై విశ్వాసం ఉంచి, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
