Commonwealth of Nations | అజయ్ బాబుకు చంద్రబాబు అభినందనలు
విజయనగరం, ఆంధ్రప్రభ: గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత అయిన తన తండ్రి వల్లూరి శ్రీనివాసరావు అడుగుజాడల్లో నడుస్తూ అజయ బాబు అంకితభావంతో గొప్ప క్రీడా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చంద్రబాబు కొనియాడారు.
అజయ సాధించిన ఈ రజత పతకం ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచ వేదికపై భారత క్రీడా ప్రతిభను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో గర్వకారణం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు అంతర్జాతీయ వేదికపై మరోసారి తన ప్రతిభను చాటాడు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నిర్వహిస్తున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 79 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుని దేశానికి కీర్తి తీసుకొచ్చాడు.
21 ఏళ్ల అజయ్ బాబు పోటీల్లో మొత్తం 330 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 181 కిలోలు ఎత్తి తన ప్రతిభను నిరూపించాడు. స్వర్ణ పతకానికి కేవలం ఒక కిలో దూరంలోనే నిలిచిపోవడం విశేషం. స్వల్ప తేడాతో బంగారు పతకం చేజారినా, అజయ్ ప్రదర్శన అందరి ప్రశంసలు అందుకుంది.
అజయ్ బాబు స్వస్థలం విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామం. ఈ విజయంతో కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఆరుకు చేరింది.
అజయ్ విజయానికి మరో ప్రత్యేకత..
అజయ్ తండ్రి వల్లూరి శ్రీనివాసరావు గతంలో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్‌గా గుర్తింపు పొందారు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 56 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి దేశానికి కీర్తి తీసుకొచ్చారు. ఇప్పుడు తండ్రి చూపిన మార్గంలోనే కుమారుడు కూడా కామన్వెల్త్ వేదికపై రజత పతకం సాధించి కుటుంబ క్రీడా వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు.
