రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచన

రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో సీఎంఓ ఆకస్మిక తనిఖీ

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై సీఎంఓ డా. కిరణ్ రాజ్ కుమార్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

ఆసుపత్రికి చేరుకున్న సీఎంఓ పలు వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, మందులు, ఆహారం తదితర అంశాలపై ఆరా తీశారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పనితీరును పరిశీలించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

ఆసుపత్రిలో అందుతున్న సేవలపై పలువురు రోగులు సంతృప్తి వ్యక్తం చేయడంతో సీఎంఓ డా. కిరణ్ రాజ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సి.ఎం. మధు కుమార్‌తో పాటు మొత్తం సిబ్బందిని అభినందించారు.

ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో ఏరియా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.