అజయ్ బాబు రజతం.. ఏపీ క్రీడా చరిత్రలో గర్వకారణం
కామన్వెల్త్ వేదికపై అజయ్ బాబు రజత పతకం
330 కిలోలు ఎత్తి తెలుగు కీర్తి చాటిన వెయిట్‌లిఫ్టర్
రాష్ట్ర క్రీడా చరిత్రలో గర్వకారణమన్న శాప్ చైర్మన్
మరిన్ని స్వర్ణ పతకాలతో దేశానికి కీర్తి తేవాలని ఆకాంక్ష
విజయవాడ, ఆంధ్రప్రభ: కామన్వెల్త్ గేమ్స్–2026లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు రజత పతకం సాధించడం రాష్ట్ర క్రీడా చరిత్రలో గర్వించదగ్గ ఘట్టమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఏ. రవి నాయుడు పేర్కొన్నారు. గ్లాస్గోలో జరిగిన పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో అజయ్ బాబు స్నాచ్‌లో 149 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 181 కిలోలు ఎత్తి మొత్తం 330 కిలోలతో రజత పతకాన్ని కైవసం చేసుకోవడం ప్రతి తెలుగు యువకుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా అజయ్ బాబుకు శాప్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావంతో సాధించిన ఈ విజయం రాష్ట్ర క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనమని రవి నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇదే పట్టుదలతో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకాలు సాధిస్తూ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, శాప్ ప్రతిభావంతులైన క్రీడాకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ ప్రపంచ స్థాయి విజయాలకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందని స్పష్టం చేశారు.
