ఎవ‌రికీ వెర‌వ‌ను.. న్యాయంగా ఉన్నా..

  • 63 కోర్టు ధిక్కార కేసులు.. చట్టపరంగానే ఎదుర్కొంటా..
  • చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడేందుకే చర్యలు తీసుకున్నాం
  • భూ కబ్జాదారులే కోర్టుల్లో కేసులు వేస్తున్నారు..
  • హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైడ్రా కమిషనర్‌గా తాను రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నానని, ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను పరిరక్షించడమే తన లక్ష్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. తనపై నమోదైన 63 కోర్టు ధిక్కార కేసులు భూ కబ్జాదారులు, ల్యాండ్ మాఫియా వర్గాలు దాఖలు చేసినవేనని ఆయన పేర్కొన్నారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ స్ఫూర్తితో గత రెండేళ్లుగా హైడ్రా పనిచేస్తోందన్నారు. మార్కెట్ విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను రక్షించామని వెల్ల‌డించారు. ఇప్పటివరకు ఆరు చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామ‌ని, మరో 20 చెరువుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

బడా భూ కబ్జాదారులు ఆక్రమించిన వందలాది చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్నందునే హైడ్రాకు ధైర్యంగా చర్యలు తీసుకునే అవకాశం లభిస్తోందని స్ప‌ష్టం చేశారు.

లోతుకుంట భూముల వ్యవహారంపై ఆరోపణలు

లోతుకుంట భూముల వ్యవహారంలో సుమారు రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయని రంగనాథ్ ఆరోపించారు. అనుమతులు లేకుండా వారసత్వ ప్రాధాన్యమున్న రాతిగుట్టలను పేల్చివేయడం, వందలాది చెట్లను నరికివేయడం జరిగిందని పేర్కొన్నారు. సేవ్ ది రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలు, స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా చర్యలు చేపట్టిందని తెలిపారు. అనంతరం సంబంధిత సంస్థ తమపై కోర్టు ధిక్కార కేసు దాఖలు చేసిందని చెప్పారు.

తనపై ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు అన్నీ ప్రభుత్వ భూములు, చెరువులు, సామాన్యుల ప్లాట్లను కాపాడే క్రమంలో ఎదురైనవేనని రంగనాథ్ పేర్కొన్నారు. ఈ కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. ప్రభుత్వం గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.