టౌన్ ప్లానింగ్ శాఖపై అవినీతి ఆరోపణలు
మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ నాయకుల వినతి
నర్సాపురం, ఆంధ్రప్రభ : టౌన్ ప్లానింగ్ శాఖలో పేరుకుపోయిన అవినీతిని అరికట్టాలని, అక్రమ నిర్మాణాల నియంత్రణలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి శుక్రవారం జిల్లా కార్యాలయాలలో నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమానికి ప్రజల నుండి కుప్పలు తెప్పలుగా వినతులు, ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు, టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరు, భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకం (BPS) అమలుపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.
భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో ప్రభుత్వ రుసుములతో పాటు భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయని బీజేపీ నేతలు పేర్కొన్నారు. నిర్మాణం జరుగుతున్న సమయంలో అధికారులు తగిన రీతిలో పర్యవేక్షించకుండా, నిర్మాణం పూర్తయిన తర్వాత నోటీసులు ఇచ్చి బిపిఎస్ ద్వారా భారీ జరిమానాలు వసూలు చేయడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలను బాధ్యులను చేయడం తగదని, చిన్న నివాస గృహాలకు, భారీ వాణిజ్య అక్రమ నిర్మాణాలకు ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ పనితీరుపై స్వతంత్ర ఉన్నతస్థాయి విచారణ లేదా ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని నేతలు డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవన అనుమతుల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేసి జియో-ట్యాగింగ్, ఫోటో ఆధారిత డిజిటల్ తనిఖీలను తప్పనిసరి చేయాలన్నారు. చిన్న నివాస గృహాలకు సరళమైన, తక్కువ రుసుముతో కూడిన క్రమబద్ధీకరణ విధానాన్ని రూపొందించాలని కోరారు.
అలాగే ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, రహదారుల ఆక్రమణలు మరియు భారీ వాణిజ్య అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక విజిలెన్స్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసి, అనుమతులు మరియు నోటీసుల వివరాలను డిజిటల్ డాష్‌బోర్డ్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టడంతో పాటు వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్ది పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్ అధికారులను కలిసిన వారిలో బీజేపీ నాయకులు రావూరి ప్రసాద్, మునికోటి వెంకటేశ్వరరావు, వనమాలి శ్రీనివాస్, గుణిశెట్టి శ్రీనివాసరావు, జోస్యుల విశ్వప్రతాప్, గన్నబత్తుల సత్యవతి, చింద్రిపు ఉదయభాస్కర్, కొప్పర్తి వెంకట్ తదితరులు ఉన్నారు.
