దస్తావేజు లేఖరుల పొట్ట కొట్టొద్దు!

  • 396 జీవోతో లక్షలాదిమంది కుటుంబాలు రోడ్డున పడటం ఖాయం
  • మంగళగిరి దస్తావేజులేఖరుల ఆందోళన
  • ఎనిమిదో రోజుకు చేరిన పెన్డౌన్ నిరసన

మంగళగిరి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో తీసుకు వచ్చిన 396 జీవో వలన లక్షలాది మంది దస్తావేజు లేఖరుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతాయని మంగళగిరి దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం సెక్రటరీ మందడపు పుల్లా కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దస్తావేజుల తయారీ విధానాన్ని రిజిస్ట్రేషన్ల సేవా కేంద్రాలకు (ఆర్.ఎస్.కె సెంటర్లు) అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళగిరి దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట పెన్ డౌన్ పేరిట చేపట్టిన నిరసన కార్యక్రమం సోమవారంతో ఎనిమిదో రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా సెక్రటరీ పుల్లా కృష్ణ మాట్లాడుతూ, మూడు తరాలుగా దస్తావేజు లేఖరుగా వృత్తిని కొనసాగిస్తూ, జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. ఆర్ఎస్కే సెంటర్లకు వీటిని అప్పగించడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఇంగ్లీషులో ఫార్మేట్ తయారు చేస్తారని అంటున్నారని తెలుగులోనే అర్థం చేసుకునే పరిస్థితి లేదని తాజా విధానం ఏ విధంగా సక్సెస్ అవుతుందని, అరగంటలో డాక్యుమెంట్ ఇవ్వటం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. తామైతే కక్షి ధారుని ఇంటికి వెళ్లి సమాచారం సేకరించి డాక్యుమెంట్లను తయారు చేస్తామని అన్నారు.

ఆర్.ఎస్.కె సెంటర్ల వలన అది సాధ్యపడదని పేర్కొన్నారు. అక్రమాలు సైతం చోటు చేసుకుంటాయని, కక్షి దారులు ఇబ్బందులు పడతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖలో ధరణి పోర్టర్ అనే విధానం తీసుకురావడం వలన అవినీతి చోటు చేసుకుందని గుర్తు చేశారు. గత వైసిపి ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకు వచ్చి తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. తక్షణమే 396 జీవోను రద్దు చేయకపోతే ప్రభుత్వానికి నష్టం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు యద్దలపూడి శివయ్య, సెక్రటరీ మందడపు పుల్లా కృష్ణ, గుంటూరు జిల్లా జాయింట్ సెక్రెటరీ మక్కిన ప్రకాష్ బాబు, తిరుపతిరావు, సహదేవుడు, శ్రీరామ్ మూర్తి, బాలాజీ, రంగిశెట్టి శ్రావణ్, నాగేశ్వరరావు, భవాని, దాసు, కనక సుందర్ తదితరులు పాల్గొన్నారు.