రుద్రూర్‌లో గంజాయి ముఠా అరెస్ట్

ఐదు కిలోల గంజాయి, రెండు బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం

ఫోటో రైటప్: వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ శ్రీనివాస్

రుద్రూర్, ఆంధ్రప్రభ: రుద్రూర్ మండలంలో ఐదు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలోని హెచ్‌పీ బంక్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా కనిపించారని తెలిపారు.

వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బైకుల పెట్రోల్ ట్యాంక్ కవర్లలో దాచిన ఐదు కిలోల గంజాయి లభించిందని పేర్కొన్నారు. గంజాయితో పాటు రెండు బైకులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసుల విచారణలో బీహార్‌కు చెందిన బల్వంత్ కుమార్ సింగ్ కొంతకాలంగా కామాక్షి రైస్ మిల్లులో పనిచేస్తున్నట్లు తెలిసిందన్నారు. మూడు సంవత్సరాల క్రితం కోటగిరిలోని బాలాజీ రైస్ మిల్లులో పనిచేసే సంజీవ్‌తో పరిచయం ఏర్పడిందని తెలిపారు.

వీరిద్దరూ కలిసి రైస్ మిల్లుల్లో పనిచేసే హమాలీలకు గంజాయి విక్రయించి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారని, బీహార్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తి నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు.

గంజాయి సరఫరా చేసిన రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, మరో ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని ఏసీపీ తెలిపారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని చెప్పారు. నిషేధిత మత్తు పదార్థాలను విక్రయించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మత్తు పదార్థాల విక్రయాలు, సరఫరాకు సంబంధించిన సమాచారం పోలీసులకు లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ కృష్ణ, కోటగిరి ఎస్సై శ్రీనివాస్, రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.