సర్కారు బడి.. సమస్యలు చతికిల పడి!

నాలుగు గదుల్లో ఎనిమిది తరగతుల బోధన.. వంటకు వరండానే దిక్కు

చండ్రుగొండ ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతున్నా కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనడానికి మండలంలోని రావికంపాడు యూపీఎస్ పాఠశాల ఉదాహరణగా నిలుస్తోంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కొనసాగుతున్న ఈ పాఠశాలలో సుమారు 100 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

పాఠశాలలో కేవలం నాలుగు తరగతి గదులు మాత్రమే ఉండటంతో ఒక్కో గదిలో రెండు తరగతులను నిర్వహించాల్సి వస్తోంది. దీంతో విద్యార్థుల చదువుపై ఆసక్తి తగ్గుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా ఒకే గదిని ఆఫీస్ రూమ్, విద్యార్థుల బోధన గది, స్టోర్ రూమ్‌గా వినియోగిస్తున్నారు. ప్రీ ప్రైమరీ చిన్నారుల తరగతులు సైతం ఈ నాలుగు గదుల్లోనే నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది.

మధ్యాహ్న భోజనం తయారీకి ప్రత్యేక గది లేకపోవడంతో పాఠశాల వరండాలోనే వంటలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పశువులు పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయి. దీనికి తోడు కోతుల బెడద కూడా విద్యార్థులకు సమస్యగా మారింది. తాగునీటి సమస్య సైతం వేధిస్తోంది.

విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతున్న పాఠశాల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రావికంపాడు గ్రామస్తులు కోరుతున్నారు.