revanth | ఏఐసీసీ భేటీపై ఉత్కంఠ
revanth | ఏఐసీసీ భేటీపై ఉత్కంఠ
ఖర్గే, రాహుల్ గాంధీతో కీలక సమావేశాలు
పార్టీ వ్యూహాలు, యువత రాజకీయ ప్రవేశం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చకు అవకాశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కీలక సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటారు.
ఈ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇటీవల దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ కూడా సమావేశంలో ప్రధాన అంశాలుగా ఉండనున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కూడా చర్చ జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సమావేశంలో యువత రాజకీయ భాగస్వామ్యానికి సంబంధించిన అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ఆయన ప్రతిపాదించనున్నట్లు సమాచారం. “జై జవాన్.. జై కిసాన్.. జై యువ” అనే నినాదంతో ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్ఠానం ముందుంచనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇండియా (INDIA) కూటమి నేతలతోనూ చర్చించాలని రాహుల్ గాంధీని కోరనున్నట్లు సమాచారం.
