Drug peddlers| ముగ్గురు పోలీసులకు గాయాలు

Drug peddlers| ముగ్గురు పోలీసులకు గాయాలు

చేజ్ చేసి పట్టుకున్న డ్రగ్స్ నిందితుడు
కానిస్టేబుల్ కాలుపై కారు ఎక్కించిన సైఫ్
అబిడ్స్‌లో డ్రగ్స్ ఆపరేషన్ కలకలం
పరారైన నిందితుడు అఫ్జల్‌గంజ్‌లో అరెస్ట్
డ్రగ్స్ కేసులో హత్యాయత్నం నమోదు

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : నగరంలో డ్రగ్స్ నిరోధక చర్యల సందర్భంగా డ్రగ్స్ పెడ్లర్ పోలీసులపై కారుతో దాడి చేసి పరారయ్యే ప్రయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. అబిడ్స్‌లో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు సైఫ్ కానిస్టేబుల్ కాలిపై కారును ఎక్కించి తప్పించుకునేందుకు యత్నించాడు. పోలీసులు వెంటాడి అఫ్జల్‌గంజ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ సమీపంలో నిఘా ఏర్పాటు చేశారు. డ్రగ్స్ సరఫరా చేసేందుకు కారులో వచ్చిన హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సైఫ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కారు పక్కకు తీస్తున్నట్లు నటించిన సైఫ్, ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా నడిపి హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌పైకి దూసుకెళ్లాడు. దీంతో మహేందర్ కాలు తీవ్రంగా దెబ్బతిని ఫ్రాక్చర్ అయింది.

నిందితుడు అక్కడి నుంచి పరారవ్వగా, పోలీసులు వెంటాడి అఫ్జల్‌గంజ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌ను చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు.

మహేందర్ యాదవ్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం (అటెంప్ట్ టు మర్డర్) సహా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు హెచ్-న్యూ పోలీసుల అదుపులో ఉండగా, డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.