అతిగా పాటలు వింటున్నారా? జాగ్రత్త..!

  • స్ట్రెస్ తగ్గించేందుకు గంటల తరబడి సంగీతం వింటున్నారా?
  • జ్ఞాపకశక్తి మందగించే ప్రమాదం..
  • వినికిడి శక్తిపైనా ప్రభావం!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రోజంతా పని ఒత్తిడి, చదువు భారం, వ్యక్తిగత సమస్యలు… ఇలా ఎన్నో కారణాలతో చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటి సమయంలో చాలామందికి మొదట గుర్తొచ్చేది మంచి సాంగ్స్ , మ్యూజిక్. ఇష్టమైన పాటలు వినగానే మనసు ప్రశాంతంగా మారినట్లు, కాస్త తేలికగా మారిన‌ట్టు అనిపిస్తుంది. కొన్ని నిమిషాల పాటు ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదిస్తే మూడ్ మారిపోవడం, ఆందోళన తగ్గిపోవడం సహజం. అందుకే చాలా మంది పని చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ప్రయాణంలో, నిద్రపోయే ముందు కూడా ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని గంటల తరబడి పాటలు వింటుంటారు.

అయితే సంగీతం ఎంత మేలు చేస్తుందో, అదే సంగీతాన్ని అతిగా వినడం అంతే ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అధిక శబ్దంతో, ఎక్కువసేపు హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌బడ్స్ ఉపయోగించడం వల్ల కేవలం చెవులకే కాదు.. మెదడు పనితీరుపైనా ప్రభావం పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

జ్ఞాపకశక్తిపై ప్రభావం…

చాలామంది ఒకేసారి రెండు పనులు చేయడం అలవాటు చేసుకుంటున్నారు. చదువుతూనే పాటలు వినడం, కార్యాలయంలో పని చేస్తూనే ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం, ఇంటి పనులు చేస్తూనే సంగీతం వినడం ఇప్పుడు సాధారణం. అయితే మెదడు ఒకేసారి రెండు రకాల సమాచారాన్ని ప్రాసెస్ చేయాల్సి రావడం వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సాహిత్యం ఉన్న పాటలు వింటూ చదివితే లేదా క్లిష్టమైన పనులు చేస్తే, మెదడు పాటలోని పదాలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. దీంతో చదివిన విషయాలను పూర్తిగా గుర్తుంచుకోలేకపోవడం, కొద్దిసేపటి క్రితం జరిగిన విషయాలు మరిచిపోయినట్లు అనిపించడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనినే కొంతమంది షార్ట్ టర్మ్ మెమొరీపై ప్రభావంగా వివరిస్తుంటారు.

మెదడుకు కూడా విశ్రాంతి అవసరమే

మన శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో, మెదడుకు కూడా విశ్రాంతి అంతే అవసరం. కానీ నిరంతరం చెవుల్లో సంగీతం వినిపిస్తుంటే మెదడు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉంటుంది. ప్రతి శబ్దాన్ని విశ్లేషిస్తూ ఉండటంతో మానసిక అలసట పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల పని సామర్థ్యం తగ్గడం, చిన్న విషయాలకే చిరాకు రావడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు.

అలాగే, చాలా మంది వారు ఏ మూడ్ లో ఉంటే అదే ఎమోష‌న్ ను ప్రతిబింబించే పాటలనే ఎంచుకుని వింటుంటారు. సంతోషంగా ఉన్నప్పుడు ఉత్సాహభరితమైన పాటలు, ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమ గీతాలు, బాధలో ఉన్నప్పుడు విషాదభరితమైన పాటలు వినడం చాలామందిలో కనిపించే సహజమైన అలవాటు.

అయితే తీవ్ర నిరాశ, ఒంటరితనం లేదా మానసిక ఒత్తిడిలో ఉన్న వ్యక్తులు ఎప్పటికప్పుడు అదే తరహా బాధను గుర్తు చేసే పాటలనే పదే పదే వింటూ ఉంటే, మెదడు కూడా ఆ భావోద్వేగాల చుట్టూనే తిరిగే అవకాశం ఉంటుంది. దీంతో బాధ, ఆందోళన లేదా నిరాశ నుంచి త్వరగా బయటపడడం కొంతమందికి కష్టంగా మారవచ్చు. ప్రతికూల ఆలోచనలు మళ్లీ మళ్లీ గుర్తుకు రావడం వల్ల మానసిక అలసట కూడా పెరిగే అవకాశం ఉంది.

అందుకే ఒత్తిడి లేదా నిరాశలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఒకే రకమైన విషాదభరితమైన పాటలు వినడం కంటే, క్రమంగా ప్రశాంతమైన ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, ప్రకృతి శబ్దాలు లేదా ఉత్సాహాన్ని పెంచే సంగీతం వైపు మళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సంగీతంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటం, వ్యాయామం, ధ్యానం, యోగా వంటి అలవాట్లు కూడా మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి.

వినికిడి శక్తికీ ముప్పే..

ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్‌లో అధిక శబ్దంతో పాటలు వినడం వల్ల చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మొదట్లో స్వల్పంగా వినికిడి తగ్గినట్లు అనిపించినా, దీర్ఘకాలంలో శాశ్వత వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమందికి చెవుల్లో ఎప్పుడూ గింగిరాలు వినిపించడం, మాటలు స్పష్టంగా వినిపించకపోవడం, పెద్ద శబ్దాలు ఇబ్బందిగా అనిపించడం వంటి సమస్యలు కూడా అధికంగా ఇయర్‌ఫోన్స్ వినియోగించే వారిలో కనిపించవచ్చు.

అదేవిధంగా, పాటలు వింటూ నిద్రపోయే అలవాటు చాలామంది ఉంటుంది. అయితే రాత్రంతా ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని నిద్రపోవడం వల్ల మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోయే అవకాశం ఉంటుంది. ఉదయం లేవగానే అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, రోజంతా నీరసంగా ఉండడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

స్ట్రెస్ తగ్గుతుంది.. కానీ సమస్యలు పోవు

సంగీతం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఒత్తిడిని కొంతసేపు మరిచిపోయేలా చేస్తుంది. అయితే ఒత్తిడికి అసలు కారణమైన సమస్యలను మాత్రం పరిష్కరించదు. అందుకే కేవలం పాటలపై మాత్రమే ఆధారపడకుండా, జీవనశైలిలో ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లను కూడా పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం, యోగా, వ్యాయామం, నడక, పుస్తకాలు చదవడం, ప్రకృతిలో కొంతసేపు గడపడం, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో మాట్లాడటం వంటి అలవాట్లు కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఎలా వినాలి?

సంగీతాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ పరిమితిలో వినడం ముఖ్యం. రోజుకు 20 నుంచి 30 నిమిషాల పాటు ప్రశాంతమైన సంగీతం లేదా వాయిద్య సంగీతం వినడం మంచిది. ఇయర్‌ఫోన్స్ ఉపయోగించినప్పుడు శబ్దం 60 శాతం కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. 60/60 నియమం పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంటే గరిష్ఠంగా 60 శాతం వాల్యూమ్‌తో 60 నిమిషాలకంటే ఎక్కువ వినకూడదు. ఆ తర్వాత చెవులకు, మెదడుకు కొంత విరామం ఇవ్వాలి. నిరంతరం ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఉండే అలవాటును తగ్గించుకోవాలి. చదువు లేదా ఎక్కువ ఏకాగ్రత అవసరమైన పనులు చేస్తున్నప్పుడు పాటలు వినకుండా ఉండటం మంచిది.

పరిమితిలో ఉంటేనే సంగీతం ఔషధం…

సంగీతం మనసుకు ఆనందాన్ని ఇచ్చే గొప్ప సాధనం. ఒత్తిడిని తగ్గించడంలో, మూడ్‌ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఏ మంచి విషయమైనా హద్దులు దాటితే ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే సంగీతాన్ని ఆస్వాదించండి.. కానీ అతిగా వినే అలవాటు మాత్రం చేసుకోకండి. పరిమితిలో సంగీతాన్ని వింటే మానసిక ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, వినికిడి శక్తిని దీర్ఘకాలం కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.