చేనేత సహకార సంఘాల బలోపేతానికి పూర్తి సహకారం
- కేంద్ర పథకాల కోసం సమగ్ర డీపీఆర్ సిద్ధం చేయాలని సూచన
- నేలపట్ల సొసైటీ అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన పిల్లలమర్రి శ్రీనివాస్‌కు సన్మానం
- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చేనేత రంగాన్ని ఆదుకోవడానికి, చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయడానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం గచ్చిబౌలిలోని ఎంపీ నివాసంలో నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ డైరెక్టర్, నేలపట్ల చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా మూడోసారి ఘనవిజయం సాధించిన పిల్లలమర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ను ఎంపీ శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
చేనేత సమస్యలపై సుదీర్ఘ చర్చ
అనంతరం చేనేత రంగం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలు, చేనేత సహకార సంఘాల అభివృద్ధి, కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై ఎంపీ చామలతో పిల్లలమర్రి శ్రీనివాస్ బృందం సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ద్వారా చేనేత సంఘాల అభివృద్ధికి చేపట్టవలసిన కార్యక్రమాలపై ఒక సమగ్ర డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించారు. నాబార్డ్, ఎన్‌హెచ్‌టీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా చేనేత సంఘాలకు, కార్మికులకు అందాల్సిన సబ్సిడీలు, ఆర్థిక సహాయ పథకాలు, ఇతర ప్రయోజనాలను చేకూర్చడానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు.
ఎంపీకి ధన్యవాదాలు
చేనేత రంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి చేనేత సహకార సంఘాల తరఫున, కార్మికుల తరఫున, భువనగిరి పార్లమెంట్ ప్రజల తరఫున పిల్లలమర్రి శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ లింగోటం సొసైటీ అధ్యక్షుడు తడక నరసింహ, వెంకటేష్, నేలపట్ల చేనేత సహకార సంఘం మాజీ కార్యదర్శి తడక వెంకటేష్, రవ్వ రాజు తదితరులు పాల్గొన్నారు.
