పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తామని తల్లిదండ్రుల ప్రతిజ్ఞ

బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ: మండలంలోని ఆకెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేశారు.

శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ పిల్లలు పాఠశాలలో ఏమి నేర్చుకుంటున్నారో తెలుసుకోవడంతో పాటు ఇంటి వద్ద హోంవర్క్ చేయిస్తామని తెలిపారు.

తమ పిల్లలు పాఠశాలకు రాకపోతే వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. పిల్లల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులుగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ పుష్పలత, విద్యార్థుల తల్లిదండ్రులు చొప్పరి రాజం, ఎగ్గే రవీనా, పోతుల రజిత, పొట్లచర్ల రమ, చెన్నడి మోహన్‌రెడ్డి, కొండి అనిల్, కొల్లూరి రాజయ్య, దూడ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.