గ్రామ పంచాయతీ నిధులను విద్యుత్ బిల్లులకు మళ్లించవద్దు
- అదనపు కలెక్టర్, డీపీఓ లకు సర్పంచుల వినతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీలకు చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులను పెండింగ్ విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం మళ్లించవద్దని, ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా పంచాయతీ అధికారి (డీపిఓ) లను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో ఉన్న పెండింగ్ విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని కోరారు. స్థానిక స్వపరిపాలన వ్యవస్థ బలోపేతం కోసం, గ్రామాల అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బిల్లుల కోసం మళ్లించడం సరికాదన్నారు. ఆ నిధులను గ్రామాల సమస్యల పరిష్కారానికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సర్పంచుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ వినతిపత్రం సమర్పించిన వారిలో సర్పంచుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి, దండు మల్కాపురం గ్రామ సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, అంకిరెడ్డి గూడెం గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల కోశాధికారి, కొయ్యలగూడెం గ్రామ సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్, జై కేసారం గ్రామ సర్పంచ్ సమ్మిరెడ్డి భారతమ్మ జనార్దన్ రెడ్డి, గుండ్లబావి సర్పంచ్ నందగిరి వెంకటేష్ గౌడ్, కాట్రేవు సర్పంచ్ బోయ మహేందర్ మణి శరత్ కుమార్ తదితరులు ఉన్నారు.
