గుజరాత్లో ఉగ్రవాదుల భారీ నెట్వర్క్ ఛేదన..
- మరో ఐదుగురు అనుమానితుల అరెస్టు..
- మొత్తం సంఖ్య 13కు చేరిక
- జైష్-ఏ-మహ్మద్‌తో సంబంధాలపై ఏటీఎస్ దర్యాప్తు ముమ్మరం
అహ్మదాబాద్, ఆంధ్రప్రభ : గుజరాత్లో ఉగ్రవాద కార్యకలాపాలపై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చేపట్టిన భారీ ఆపరేషన్‌లో మరో ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసింది. తాజా అరెస్టులతో ఈ కేసులో ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య 13కు చేరింది. ప్రాథమిక దర్యాప్తులో నిందితులకు నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇప్పటికే అరెస్టైన ఎనిమిది మంది నిందితుల విచారణలో లభించిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి తాజా అరెస్టులు చేపట్టినట్టు ఏటీఎస్ అధికారులు తెలిపారు. నిందితులు పేలుడు పదార్థాల తయారీ, టైమర్ ఆధారిత పేలుళ్లకు సంబంధించిన శిక్షణ పొందేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గత మూడేళ్లలో గుజరాత్‌లోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో పేలుడు పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందుకు అవసరమైన సామగ్రిని ఆన్‌లైన్‌తో పాటు స్థానిక మార్కెట్ల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
దర్యాప్తులో అరెస్టైన వారిలో ఇద్దరు జమ్మూకశ్మీర్‌లో ఏకే-47 ఆయుధాల వినియోగంపై శిక్షణ పొందినట్లు తేలినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే కార్బన్ మోనాక్సైడ్ తయారీకి సంబంధించిన శిక్షణ పొందినట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్లో ఒకరు వడోదరకు చెందిన వ్యక్తితో తరచూ సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు.
ఏటీఎస్ దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు జిహాదీ భావజాలానికి సంబంధించిన 43 పుస్తకాలను డౌన్లోడ్ చేసినట్లు గుర్తించారు. అలాగే ఖాదియాసన్ మదరసాలో కొందరు అనుమానితుల కదలికలపై అధికారులు నిఘా పెట్టినట్లు సమాచారం. నందాసన్ ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లోనే తాజా ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే అరెస్టైన ఎనిమిది మందిని కోర్టులో హాజరుపరచగా, తాజాగా అరెస్టైన ఐదుగురికి ఏడు రోజుల పోలీసు కస్టడీ మంజూరైంది. కడి కోర్టు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలు, కమాండోలను మోహరించారు. ఈ కేసులో ఉగ్రవాద నెట్వర్క్, శిక్షణ, ఆర్థిక లావాదేవీలు, ఇతర సంబంధాలపై ఏటీఎస్ దర్యాప్తు మరింత విస్తరించింది.
