ఆ పారిశ్రామికవేత్తల బకాయిలు విడుదల చేయాలి
- వైసిపి నేతకామరాజ్ హరీష్
భవానిపురం, ఆంధ్రప్రభ: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ప్రోత్సాహకాలు, సబ్సిడీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్ కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో దళిత, గిరిజన వర్గాల పట్ల చంద్రబాబు నాయుడు నిజస్వరూపం మరోసారి బయటపడిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో మాటలు మాణిక్యాలు చెప్తూ, దళిత యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీలు నేడు పూర్తిగా చేతలలో శూన్యంగా మారాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,500 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన దాదాపు రూ.780 కోట్ల ఇన్సెంటివ్‌లు, సబ్సిడీ బకాయిలను రెండేళ్లుగా నిలిపివేసి, వారిని నట్టేట ముంచారని ఆరోపించారు.
దళిత పారిశ్రామికవేత్తలు గుంటూరు జిల్లా చినకాకానిలో 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా, అర్ధనగ్న ప్రదర్శనలతో తమ ఆవేదనను చాటుకుంటున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి మొరపెట్టుకున్నా హామీలకే పరిమితమయ్యారు.. తప్ప,ఆచరణలో పైసా విదల్చలేదని విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పారిశ్రామికవేత్తలపై పోలీస్ యాక్ట్-30 పేరుతో ఆంక్షలు విధించడం, పోలీసులను ప్రయోగించి ఉద్యమాలను అణచివేయాలని చూడడం చంద్రబాబు నిరంకుశ పాలనకు అద్దం పడుతోందన్నారు.
గతంలోనూ ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించి, దళిత సంక్షేమ పథకాలను గాలికి వదిలేసిన చరిత్ర చంద్రబాబుదని, ఇప్పుడు మళ్లీ అదే మోసాన్ని పునరావృతం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తల రూ.780 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో వైస్సార్సీపీ తరఫున బాధితులకు అండగా నిలిచి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని కామరాజ్ హరీష్ కుమార్ హెచ్చరించారు.
