అర్హులందరికీ తల్లికి వందనం

  • సెంట్రల్‌లో 45,232 మంది విద్యార్థులకు లబ్ధి
  • జులై 22న తల్లుల ఖాతాల్లో రూ.47.31 కోట్లు జమ
  • ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం… సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
  • రూ.550 కోట్లతో సెంట్రల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల విస్తరణ
  • గుణదల ఆర్‌ఓబీ, అమృత్ పథకం వాటర్ ప్రాజెక్టులతో శాశ్వత పరిష్కారాలు
  • అర్హులకు నిధులు అందకపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచన
  • సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు

పాయికాపురం, ఆంధ్రప్రభ: ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సింగ్‌నగర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జులై 22న అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలోని 45,232 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.47.31 కోట్లు జమ చేయనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 64.76 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఒక్కో విద్యార్థికి సంబంధించిన రూ.2 వేల చొప్పున విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు. కొత్తగా మొదటి తరగతి, జూనియర్ ఇంటర్‌లో చేరిన విద్యార్థులతో పాటు అర్హత నిర్ధారణ పెండింగ్‌లో ఉన్న వారికి ఆగస్టు 30న నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

సెంట్రల్ సమగ్ర అభివృద్ధి

సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.550 కోట్లకు పైగా నిధులు సమకూర్చి రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాల్స్ తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న గుణదల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.98.68 కోట్లతో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) సహకారంతో ఈ ప్రాజెక్టు సాధ్యమైందన్నారు.

తాగునీటికి శాశ్వత పరిష్కారం

సెంట్రల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా అమృత్ పథకం కింద రూ.85 కోట్ల వ్యయంతో రా వాటర్ ఫిల్ట్రేషన్ ప్లాంట్ నిర్మిస్తున్నామని తెలిపారు. వాంబే కాలనీలో త్వరలో శంకుస్థాపన చేసి కృష్ణానది నుంచి నేరుగా నీటిని తీసుకువచ్చి శుద్ధి చేసి నియోజకవర్గంలోని అన్ని ఓవర్ హెడ్ ట్యాంకులకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అదనంగా రెండు కొత్త నీటి ట్యాంకులను నిర్మించనున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగులు, షూస్, నోట్‌బుక్స్‌తో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు. మరో మూడు సంవత్సరాల్లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని బొండా ఉమ స్పష్టం చేశారు. ‘తల్లికి వందనం’ పథకానికి అర్హులైనప్పటికీ ఎవరి ఖాతాలోనైనా నిధులు జమ కాకపోతే సంబంధిత సచివాలయం లేదా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకోవాలని, వెంటనే పరిశీలించి అర్హుల ఖాతాల్లో నిధులు జమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు.