విద్యుత్ దొంగలపై విజిలెన్స్ ఉక్కుపాదం

  • విజయవాడలో ఆకస్మిక తనిఖీలు..
  • తెలుగులోకి413 అక్రమ విద్యుత్ వినియోగాలు..
  • రూ.11.52 లక్షల అపరాధ రుసుము విధింపు
  • 77 మంది అధికారులతో 40 బృందాలుగా విస్తృత తనిఖీలు
  • విద్యుత్ చౌర్యం సామాజిక నేరం.. పాల్పడితే కఠిన చర్యలు
  • విజయవాడ పట్టణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వై. కొండలరావు

కృష్ణలంక, ఆంధ్రప్రభ : విద్యుత్ చౌర్యం, అనధికారికంగా అధిక లోడ్ వినియోగంపై విజయవాడ విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. విజయవాడ డివిజన్ స్క్రూ బ్రిడ్జి సెక్షన్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 413 విద్యుత్ సర్వీసుల్లో అక్రమంగా అధిక లోడ్ వినియోగిస్తున్నట్లు గుర్తించి రూ.11,51,800 అపరాధ రుసుము విధించారు. విజయవాడ పట్టణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వై. కొండలరావు, విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. విజయకుమారి ఆధ్వర్యంలో 77 మంది అధికారులు 40 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించిన వినియోగదారులను గుర్తించి చట్టప్రకారం చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అధికారులు మాట్లాడుతూ విద్యుత్‌ను అక్రమంగా వినియోగించడం చట్టవిరుద్ధమే కాకుండా సామాజిక నేరమని స్పష్టం చేశారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యానికి సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు 8331014951, 8331020537 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. విజయవాడ పట్టణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వై. కొండలరావు మాట్లాడుతూ, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అక్రమ వినియోగాన్ని అరికట్టడంతో పాటు విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించే చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి. శ్రీధర్, నాగేశ్వరరావు, అసిస్టెంట్ ఇంజనీర్ పి. సతీష్ కుమార్, ఇతర డీఈఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.