పూరీ రథయాత్రలో తొక్కిసలాట జరగలేదు: ఒడిశా ప్రభుత్వం

  • మరణించిన ఇద్దరు భక్తులు అనారోగ్యంతోనే మృతి.. సీఎంవో స్పష్టీకరణ
  • 8–9 లక్షల మంది భక్తులు వచ్చినా పరిస్థితి అదుపులోనే ఉందన్న ప్రభుత్వం

ఆంధ్రప్రభ : ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా తొక్కిసలాట జరిగిందనే ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. రథయాత్రలో ఎలాంటి తొక్కిసలాట జరగలేదని, మరణించిన ఇద్దరు భక్తులు అనారోగ్య కారణాల వల్లే ప్రాణాలు కోల్పోయారని ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

సీఎంవో వివరాల ప్రకారం, రథయాత్ర సందర్భంగా 60 ఏళ్లకు పైబడిన ఓ వృద్ధ భక్తుడు ఉక్కపోత, శ్వాస సంబంధిత సమస్యలతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించాడు. మరోవైపు 35 ఏళ్ల అనిల్ అనే భక్తుడు గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రెండు ఘటనలు వేర్వేరుగా జరిగాయని, వాటికి తొక్కిసలాటతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

జూలై 16న పూరీలో భారీ వర్షం కురవడంతో పాటు ఒకేసారి సుమారు 8 నుంచి 9 లక్షల మంది భక్తులు తరలిరావడంతో ఉక్కపోత, తేమ అధికంగా నమోదైందని పేర్కొంది. దీంతో కొందరు భక్తులు డీహైడ్రేషన్, అలసటతో అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. ప్రత్యేక సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి బాధితులకు ప్రథమ చికిత్స అందించి జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా, వారిలో చాలా మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.

గత ఏడాది గుండిచా ఆలయం వద్ద జరిగిన అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో ఈసారి ముందస్తుగానే విస్తృత భద్రతా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒడిశా విపత్తు స్పందన దళం, జాతీయ విపత్తు స్పందన దళం, పోలీసులు, ఆరోగ్య శాఖల సమన్వయంతో రథయాత్రను పర్యవేక్షించామని పేర్కొంది.

రథాలను లాగే కార్యక్రమంతో పాటు గుండిచా యాత్రకు సంబంధించిన అన్ని పూజా కార్యక్రమాలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయని ప్రభుత్వం వెల్లడించింది. రథయాత్ర విజయవంతానికి సహకరించిన సేవాయతులు, అధికారులు, భక్తులకు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.