Telangana Poet Ande Sri | రూ.4 కోట్లతో అందెశ్రీ స్మృతివనం నిర్మాణం
రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్రెడ్డి
ఘట్కేసర్లో విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులకు భూమిపూజ
ఎకరం 22 గుంటల స్థలంలో నిర్మాణం
Telangana Poet Ande Sri | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి స్వర్గీయ అందెశ్రీ స్మృతికి గుర్తుగా నిర్మించనున్న స్మృతివనం, విగ్రహ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి రేపు శంకుస్థాపన చేయనున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ కార్యక్రమం జరగనుంది. అందెశ్రీ సమాధి వద్ద స్మృతివనం, విగ్రహ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకోసం సుమారు ఎకరం 22 గుంటల స్థలాన్ని కేటాయించగా, దాదాపు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర సంస్కృతి–సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించేలా అందెశ్రీ స్మృతివనాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో, అందెశ్రీ సేవలను చిరస్థాయిగా నిలిపే ఉద్దేశంతో ఈ స్మృతివనం నిర్మాణం చేపడుతున్నారు.
