Cyberabad CI Transfers | సైబరాబాద్‌లో 55 మంది సీఐల ట్రాన్స్‌ఫ‌ర్‌

పరిపాలనా కారణాలతో కమిషనర్ ఎం. రమేష్ ఉత్తర్వులు
ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లకు కొత్త ఇన్‌స్పెక్టర్ల నియామకం

Cyberabad CI Transfers | ఆంధ్ర్రప్ర‌భ వెబ్‌డెస్క్ : సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ పరిపాలనా కారణాల దృష్ట్యా 55 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను (సీఐలు) తక్షణ ప్రభావంతో బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలో పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, విధుల పునర్విభజనలో భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

బదిలీల్లో భాగంగా ఐటీ కారిడార్‌లోని కీలక పోలీస్ స్టేషన్లు అయిన మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నార్సింగి స్టేషన్లకు కొత్త సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను నియమించారు. నగరంలో పెరుగుతున్న నేరాలు, ట్రాఫిక్, శాంతిభద్రతల దృష్ట్యా ఈ స్టేషన్లలో అనుభవజ్ఞులైన అధికారులను నియమించినట్లు సమాచారం. అదేవిధంగా సైబర్ నేరాల దర్యాప్తును మరింత బలోపేతం చేసేందుకు సైబర్ క్రైమ్స్ విభాగానికి ముగ్గురు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు మరో ముగ్గురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను కేటాయించారు.

ఈ బదిలీల అమలును వెంటనే పూర్తి చేయాలని, సంబంధిత అధికారులను రిలీవ్ చేసి కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆయా జోన్ల డీసీపీలకు కమిషనర్ ఆదేశించారు. రిలీవింగ్, రిపోర్టింగ్ వివరాలను ఆలస్యం లేకుండా కమిషనర్ కార్యాలయానికి నివేదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.