Safe City | సేఫ్ సిటీపై డీజీపీ సమీక్ష
మహిళల భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు టెక్నాలజీ వినియోగం..
మరో 12 మొబైల్ షీ టాయిలెట్లు, రెండో దశలో 862 సీసీ కెమెరాలు
Safe City | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌ను మరింత సురక్షిత, స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘సేఫ్ సిటీ’ ప్రాజెక్టు పురోగతిపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, రవాణా శాఖ కమిషనర్ హాజరయ్యారు.
వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌కు అనుగుణంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు, పాదచారులు సహా ప్రతి పౌరుడి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని డీజీపీ తెలిపారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్, హైడెఫినిషన్ సీసీటీవీ నిఘా, అన్ని పోలీసు కమిషనరేట్లలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ ద్వారా నేరాల నివారణ, అత్యవసర స్పందనను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
మహిళల సౌకర్యం కోసం ప్రస్తుతం నగరంలో 12 మొబైల్ షీ టాయిలెట్లు అందుబాటులో ఉండగా, మరో 12ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 12 జోన్లలో ఒక్కో జోన్‌కు రెండు మొబైల్ షీ టాయిలెట్లు అందుబాటులోకి రానున్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్టు తొలి దశలో ఇప్పటికే 2,306 సీసీటీవీ కెమెరాలు పనిచేస్తుండగా, రెండో దశలో మరో 862 కెమెరాల ఏర్పాటు వేగంగా కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. అన్ని కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నగరంలో 77 ప్రాంతాల్లో పెలికాన్ (పాదచారుల) ట్రాఫిక్ సిగ్నళ్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, ట్రాఫిక్ వాలంటీర్ల సహకారంతో పాదచారులకు రహదారులు సురక్షితంగా దాటేలా చర్యలు చేపట్టనున్నారు. అలాగే నగరంలోని 404 ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ బాధ్యతను జీహెచ్‌ఎంసీ చేపట్టడంతో పాటు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో పాదచారుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని నిర్ణయించారు.
అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మొబైల్ ప్రచార వాహనాల ద్వారా విస్తృత ప్రచారం కొనసాగించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు ద్వారా పోలీసు శాఖ, జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో హైదరాబాద్‌ను మరింత సురక్షితమైన, స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
