వర్షాభావ పరిస్థితులతో అమాంతం పెరుగుతున్న ధరలు
ఇప్పటికే క్వింటా 6000 పలుకుతున్న రేటు
సామాన్యులపై అదనపు భారం
జిల్లాలో తగ్గుతున్న వరిసాగు విస్తీర్ణం
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో ఆంధ్ర ప్రభ : వర్షాభావ పరిస్థితులతో వరిసాగు గణనీయంగా తగ్గుతోంది. రాబోయే రోజుల్లో సన్నబియ్యం ఉత్పత్తి తగ్గే అవకాశముందని పసిగట్టిన వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ఇది వరకే మార్కెట్ లో ధరలు క్రమంగా పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.గతంలో సన్నాలు క్వింటా ధర రూ. 4,500 నుంచి రూ. 4,800 ఉండగా.. ప్రస్తుతం చాలా చోట్ల రూ.6000 వరకు ధర పెరిగింది. బియ్యం నాణ్యత మేరకు ఒక్కో చోట రూ. వెయ్యి వరకు అదనంగా భారం పడుతోంది. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా లబ్దిదారులకు సన్నబియ్యాన్ని అందించడం కొంత ఊరటనిస్తోంది.
ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తూ..
జిల్లాలో జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్, అమని తదితర రకాల బియ్యానికి అధిక డిమాండ్ ఉంది. ఇక్కడి జనాభాకు అనుగుణంగా దిగుబడి లేకపోవడంతో కర్నూలు, మిర్యాలగూడ, నిజమాబాద్ తదితర ప్రాంతాల నుంచి సన్నబియ్యం ఎక్కువగా దిగుమతి అవుతోంది. మిల్లర్లు ఆయా జిల్లాల నుంచి వడ్లను తెప్పించి.. మరాడించి విక్రయిస్తుంటారు. అయితే రైస్ మిల్లర్లు నిల్వల మేరకు బియ్యం తయారీని ప్రారంభిస్తున్నారు. నెలరోజుల నుంచి క్రమంగా సన్నబియ్యం ధరలు పెరుగుతుండటం తో మిల్లర్లు ఆచిచూచి వడ్లను మరాడిస్తున్నారు.
రెండేళ్ల తర్వాత..
వానాకాలంలో మాత్రమే అధిక శాతం రైతులు సన్న రకాలను పండిస్తూ వస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల రైతులకు సాగునీటి సదుపాయం లభించడంతో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రెండేళ్ల క్రితం సన్నబియ్యం ధర తగ్గుముఖం పట్టింది. ఈసారి మాత్రం వర్షాభావ పరిస్థితుల కారణంగా సన్నబియ్యం ధరలు అమాంతం పెరుగుతుంగటంతో కొనలేని పరిస్థితి వస్తోంది
తగ్గుతున్న వరిసాగు..
జిల్లాలో ప్రతి ఏటా వానాకాలంలో 1.80 లక్షల ఎకరాల్లో సన్నరకాలను సాగుచే స్తున్నారు. ఇందులో లక్షకు పైగా ఎకరాల్లో వచ్చిన దిగుబడిని ప్రభుత్వం ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయిస్తుం టారు. మిగతా ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపా రులు కొనుగోళ్లు చేస్తారు. ప్రస్తుతం వర్షా భావ పరిస్థితుల కారణంగా జిల్లా అంతటా వరిసాగు దాదాపు 50వేల ఎకరాల వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే సన్నబియ్యం ధరలు మరింత పెరిగే అవ కాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొం టున్నారు.
20 రోజుల నుంచి ధరలు పెరిగాయి..
20 రోజుల నుంచి సన్నబియ్యం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నెల రోజుల క్రితం సన్నబియ్యం క్విం టా రూ. 4,500 ఉండగా.. ప్రస్తుతం రూ.6000కు చేరుకుంది. మిల్లర్లు వ్యాపారులకే క్వింటా రూ. 5,450 చొప్పున విక్రయిస్తున్నారు. జనాలకు రూ. 6000కు అమ్ముతున్నారు. భవిష్యత్లో మరింత పెరిగే అవకాశముందని మిల్లర్లు చెబుతున్నారు.
శ్రీనివాస్, కిరాణ వ్యాపారి, కరీంనగర్.
