అనారోగ్య సమస్యలతో మనస్తాపం.. మహిళ ఆత్మహత్య

దండెపల్లి, ఆంధ్రప్రభ : అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ చీరతో దూలనికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన దండెపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.దండెపల్లి ఎస్సై రాజవర్ధన్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.దండెపల్లి గ్రామానికి చెందిన మురినమడుగుల లక్ష్మి (55) గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమెకు గర్భాశయ సంబంధిత సమస్యలు ఉండటంతోపాటు, అప్పుడప్పుడు రక్తస్రావం అవుతుండేది.​గతంలోనే ఆమెకు గర్భసంచి ఆపరేషన్, గత ఏడాది కంటి ఆపరేషన్ జరిగాయి.

అయితే, తాజా అనారోగ్య సమస్యల గురించి ఆసుపత్రికి వెళ్లేందుకు ఆమె ఇబ్బందిగా, సిగ్గుగా భావించేవారని భర్త పెద్దన్న తెలిపారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన లక్ష్మి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో దూలనికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త పెద్దన్న పని నిమిత్తం చొప్పదండిలోని తన సోదరి ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న భర్త, ఇంటికి వచ్చి చూడగా లక్ష్మి విగతజీవిగా కనిపించారు. తన భార్య మృతిపై ఎవరిపైనా ఎటువంటి అనుమానాలు లేవని భర్త పెద్దన్న ఇచ్చిన ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.