ఫొటోగ్రాఫర్లకు అరుదైన అవకాశం!

  • ఉత్త‌మ ఫొటోగ్రాఫ‌ర్ల‌కు జిల్లాస్థాయి పుర‌స్కారాలు
  • మూడు విభాగాల్లో ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ డే పోటీలు
  • ఎంట్రీలు పంపేందుకు చివ‌రి తేదీ ఆగస్టు 5
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రతి ఫ్రేమ్ ఒక జ్ఞాపకం.. కాలం మరచిపోయినా… ఫొటో మాత్రం ఆ క్షణాన్ని సజీవంగా ఉంచుతుంది. మ‌ధుర క్ష‌ణాల‌ను శాశ్వతం చేసే ఫొటోగ్ర‌ఫీలో విశేష ప్ర‌తిభ‌క‌న‌బ‌రిచిన ఫొటోగ్రాఫ‌ర్ల‌కు ఆగస్ట్ 19న ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా జిల్లాస్థాయిలో పుర‌స్కారాలు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ సంద‌ర్భంగా నిర్వ‌హించే పోటీల‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సమాచార శాఖ అధికారులు, ఫొటో జ‌ర్న‌లిస్టుల‌తో క‌లిసి గురువారం క‌లెక్ట‌రేట్‌లో ఆయన ఛాంబర్ నందు ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ జిల్లా ప‌రిధిలోని ఫోటో జర్నలిస్టులు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, స్టూడియో ఫొటోగ్రాఫ‌ర్లు పోటీల్లో పాల్గొనవచ్చున‌ని.. ఫొటోగ్రాఫ‌ర్లు ఆగస్టు 5వ తేదీలోగా త‌మ ఎంట్రీలు పంపాల్సి ఉంటుంద‌న్నారు. మూడు విభాగాల్లో పోటీలు నిర్వ‌హించ‌నున్నామ‌ని.. మొద‌టి విభాగంలో జిల్లాకు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార‌స‌త్వం, ప‌ర్యాట‌కం, సంస్కృతి అంశాల్లో ఫొటో ఎంట్రీలు పంపొచ్చ‌న్నారు. రెండో విభాగంలో యువ‌త‌, పీ4, ఆర్థికాభివృద్ధి-సంక్షేమం అంశాలు, మూడో విభాగంలో అత్యుత్త‌మ న్యూస్ ఫొటో పోటీ ఉంటుంద‌న్నారు.

ప్ర‌తి విభాగంలో ప్ర‌థ‌మ బహుమతిగా రూ. 10 వేలు,ద్వితీయ బహుమతి కింద రూ. 7 వేలు తృతీయ బహుమతి గా రూ. 4 వేలు నగదు బ‌హుమ‌తుల‌తో పాటు రూ. 2 వేలు చొప్పున ఆరుగురికి ప్రోత్సాహ‌క నగదు బ‌హుమ‌తులు అందించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఒక ఫొటోగ్రాఫ‌ర్ ఒక విభాగం నుంచి మూడు ఫొటోలు, అదేవిధంగా మొత్తం మూడు విభాగాల నుంచి తొమ్మిది ఫొటోలు పంప‌వ‌చ్చ‌న్నారు.

2025, జూన్ 12 నుంచి 2026, జులై 31 మ‌ధ్య తీసిన ఫొటోలై ఉండాల‌ని.. ఫొటో సైజు 12X10 ఉండాల‌ని, ఫొటోలు ఎన్‌టీఆర్ జిల్లాలో మాత్ర‌మే తీసి, ప‌బ్లిసిటీకి మాత్ర‌మే ఉప‌యోగించేవిగా ఉండాల‌ని వివ‌రించారు. వాట‌ర్ మార్క్‌, మార్ఫింగ్ వంటి వాటిని అనుమ‌తించ‌డం జ‌ర‌గ‌దని.. ఉత్త‌మ ఫొటోల ఎంపిక విష‌యంలో న్యాయ‌నిర్ణేత‌ల‌దే తుది నిర్ణ‌యమ‌ని తెలిపారు. ఒరిజిన‌ల్ ఫొటో ఎంట్రీల‌ను డీపీఆర్‌వో కార్యాల‌యం, స్టేట్ గెస్ట్ హౌస్‌, విజ‌య‌వాడ‌-520002 చిరునామాకు నేరుగా లేదా పోస్ట‌ల్ ద్వారా స‌మ‌ర్పించ‌వచ్చన్నారు.