కర్లపాలెంలో గంజాయి విక్రయాలపై పోలీసుల దాడి..

  • నలుగురు అరెస్ట్

బాపట్ల, ఆంధ్రప్రభ : కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలను అడ్డుకునేందుకు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కర్లపాలెం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి కేసు వివరాలను వెల్లడించారు. సమావేశంలో ఎస్సై రవీంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సైకి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జగనన్న కాలనీలోని ఎంపీఎఫ్‌సీ గోదాముల ప్రాంతంలో దాడులు నిర్వహించగా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి సుమారు 500 గ్రాముల గంజాయి, 8 గంజాయి ప్యాకెట్లు, రూ.1,000 నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఒక మహీంద్రా జీప్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.అరెస్టయిన వారు మున్నంగి మణికంట (23), పొన్నపల్లి రోషన్, ఖాజా కేశవ శ్రీరామ్, గోనతోటి సుధాకర్గా గుర్తించారు. వీరిపై గతంలో కూడా పలు కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని డీఎస్పీ చంద్రమౌళి సూచించారు. గంజాయి నిర్మూలనలో ప్రజలు, మీడియా పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.