2kgs | రూ.5లక్షల విలువైన వెండి ఆభరణాలు అపహరణ
2kgs | రూ.5లక్షల విలువైన వెండి ఆభరణాలు అపహరణ
2kgs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని గోళ్లమూడి వారి వీధిలో ఉన్న నాగలక్ష్మి జ్యువెల్లరీ షాపును టార్గెట్ చేసిన దుండగులు తాళాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించి భారీ మొత్తంలో వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం షాపు యజమాని దుకాణానికి చేరుకోగా తాళాలు పగులగొట్టినట్లు కనిపించాయి. వెంటనే లోపలికి వెళ్లి పరిశీలించగా వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
దొంగలు సుమారు 2 కేజీల వెండి ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతోనే దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీ ఘటనలతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని, నిందితులను త్వరగా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
