విద్యార్థినులకు నాణ్యమైన బోధన అందించాలి: కలెక్టర్
హనుమకొండ (ఆంధ్రప్రభ): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేలా అధ్యాపకులు నాణ్యమైన బోధన అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు. గురువారం హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన, విద్యాబోధన, మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యాలు, విద్యార్థినులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేసి, ఆహారం నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్ కోర్సుల విద్యార్థినులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కలెక్టర్, ఫిజిక్స్‌తో పాటు వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి వారి అవగాహనను పరీక్షించారు. ప్రతి విద్యార్థినికి సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలను బోధించాలని, వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా అధ్యాపకులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.
నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థినులను సిద్ధం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆన్‌లైన్ ఫిజిక్స్ వాలా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థినులు కూడా ఉన్నత లక్ష్యాలతో కృషి చేసి మంచి విజయాలు సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి అజ్మీర గోపాల్, కళాశాల ప్రిన్సిపాల్ కవిత, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
