AP | రూ.1.23లక్షల కోట్ల ప్రాజెక్టులపై సమీక్ష..

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పీపీపీ కింద అమలవుతున్న ప్రాజెక్టుల ప్రగతి, ప్రభుత్వ వ్యయం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పోర్టులు, షిప్‌యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అమలు చేస్తోంది. వీటిలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక రంగం, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ వంటి కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి.

అధికారులు సమర్పించిన వివరాల ప్రకారం ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.1,23,229 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టులను సమయానికి పూర్తిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

పీపీపీ ప్రాజెక్టులను కేవలం నిర్మాణ పరంగానే కాకుండా, సుస్థిర అభివృద్ధి నమూనా (సస్టైనబుల్ మోడల్)లో అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు, సమయపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని ప్రాజెక్టుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు.