సూర్యలంక అభివృద్ధి పనులకు ఆక్రమణల తొలగింపు ప్రారంభం..
బాపట్ల, ఆంధ్రప్రభ : సూర్యలంక తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా బాపట్ల మండలం అడవి గ్రామ పంచాయితీ పరిధిలో పోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ ఎదురుగా 12 మీటర్లు (40 అడుగులు) నూతన రహదారి నిర్మాణానికి అవసరమైన ఆక్రమణల తొలగింపు చర్యలు గురువారం ప్రారంభమయ్యాయి.
తహసీల్దార్ సలీమా ఆధ్వర్యంలో సర్వేయర్ లక్ష్మీనారాయణ స్థల హద్దులను నిర్ధారించి మార్కింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో గలీలయ ప్రార్థనా మందిరం కొంత భాగం తొలగింపునకు గురయ్యే పరిస్థితి ఏర్పడటంతో సంబంధిత నిర్వాహకులు తహసీల్దార్‌ను కలిసి గడువు కోరారు.

గతంలోనే నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించలేదని తహసీల్దార్ పేర్కొన్నారు. అయితే వారి విజ్ఞప్తి మేరకు, ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించి మార్కింగ్ లోపలే నిర్మాణాన్ని పరిమితం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆదివారం వరకు గడువు మంజూరు చేశారు. నిర్దేశిత గడువులోపు స్వచ్ఛందంగా తొలగించకపోతే ప్రభుత్వ సిబ్బంది ఆక్రమణలను తొలగిస్తారని, విధులకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని గ్రామస్తులకు తహసీల్దార్ సూచించారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు పోలీసు సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు యంత్రాలతో ఆక్రమణల తొలగింపు చేపట్టనున్నందున, అంతకుముందే సంబంధిత వారు తమ హద్దుల మేరకు స్వయంగా నిర్మాణాలను సర్దుబాటు చేసుకోవాలని ఎమ్మార్వో సూచించారు.
