పనులు గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

తాడ్వాయి (ఆంధ్రప్రభ): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మేడారం హరిత హోటల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనులు, మౌలిక సదుపాయాల కల్పన, భక్తులకు మెరుగైన సౌకర్యాల ఏర్పాటుపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, జిల్లా అధికారులు, స్థానిక సర్పంచ్, పూజారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.