వర్షాల కోసం శివలింగానికి జలాభిషేకం
వికారాబాద్ (ఆంధ్రప్రభ): వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెలరోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మోమిన్పేట్ మండలం కోల్కొంద గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, గ్రామ సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులు గురువారం హనుమాన్ ఆలయంలోని శివలింగం, నందికి జలాభిషేకం నిర్వహించి సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు బిందెలతో ఆలయానికి చేరుకుని సామూహికంగా అభిషేకంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కరణం కీర్తి రామకృష్ణ మాట్లాడుతూ, వర్షాభావంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల జీవన విధానం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందన్నారు. భగవంతుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
