కాంగ్రెస్ కంచుకోటను ఛేదించేందుకు బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు
కాంగ్రెస్ కంచుకోటను ఛేదించేందుకు బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు
హిందుత్వం, ప్రాంతీయ సెంటిమెంట్‌తో బీజేపీ-బీఆర్ఎస్ కసరత్తు
కాంగ్రెస్ కౌంటర్ వ్యూహం.. స్థానిక ఎన్నికలే 2028కు సెమీఫైనల్
హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో: రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణను రెండు భాగాలుగా విభజించి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలో వ్యూహాత్మకంగా బలపడితేనే భవిష్యత్‌లో అధికార కాంగ్రెస్‌ను ఢీకొట్టగలమనే అంచనాతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే తరహా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి.
2028 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగనున్న ప్రాదేశిక ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్న ఈ పార్టీల అధినేతల దృష్టి అంతా దక్షిణ తెలంగాణపైనే కేంద్రీకృతమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కంచుకోటగా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికలు, అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఈ బెల్ట్ పూర్తిగా కాంగ్రెస్‌కు అండగా నిలిచినట్లు స్పష్టమవుతోంది. ఈ బలమైన కోటను బద్దలు కొట్టడమే బీజేపీ, బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
హిందుత్వమే బీజేపీ ఆయుధం
భౌగోళికంగా చూస్తే తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ తన ఉనికిని విస్తరించుకుంటుండగా, దక్షిణ తెలంగాణలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో సైతం పట్టు సాధించేందుకు హిందుత్వ కార్డును ప్రధాన ఆయుధంగా మలచుకుంటోంది. స్థానిక ఉత్సవాలు, ఆలయాల చుట్టూ కార్యక్రమాలు నిర్వహిస్తూ, సాంప్రదాయ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఉత్తర తెలంగాణలో అనుసరించిన వ్యూహాన్ని దక్షిణ తెలంగాణ సామాజిక సమీకరణాలకు అనుగుణంగా అమలు చేసి కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించింది.
సెంటిమెంట్‌తో బీఆర్ఎస్ అడుగులు
గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయిన బీఆర్ఎస్ తిరిగి పుంజుకునేందుకు తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తోంది. క్షేత్రస్థాయి ప్రాంతీయ సెంటిమెంట్, తెలంగాణ ఆకాంక్షలను ప్రధానంగా నమ్ముకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో లోపాలు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు జీవనాడిగా భావించే కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగా లేవనెత్తుతోంది.
స్థానిక నిరుద్యోగులు, రైతాంగ సమస్యలపై ఉద్యమిస్తూ, తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే అనే భావనను ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు గులాబీ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాకపోవచ్చనే అంచనాతో, క్షేత్రస్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే ఫార్ములా అంతర్గతంగా అమలయ్యే అవకాశాలపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కంచుకోటను కాపాడుకునేందుకు కాంగ్రెస్ కృషి
విపక్షాల వ్యూహాలకు దీటుగా కాంగ్రెస్ కూడా తన కంచుకోటను కాపాడుకునేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఆయన సూచించే ప్రచార వ్యూహాలతో క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే తమకు అండగా నిలుస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే దాదాపు 90 శాతం గ్రామ పంచాయతీల్లో బలమైన ఉనికి సాధించామని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను అణచివేస్తున్నారనే ఆరోపణలు కూడా కాంగ్రెస్ ఎదుర్కొంటోంది.
బీజేపీ మాత్రం కేంద్ర నిధుల వినియోగం, హిందుత్వ అజెండా, స్థానిక సమస్యలపై ఛార్జ్షీట్లు విడుదల చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. బీఆర్ఎస్ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, కేటీఆర్, హరీశ్‌రావు నేతృత్వంలో కేడర్‌ను సమాయత్తం చేస్తోంది.
ప్రస్తుతం దక్షిణ తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంటుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
రెబెల్స్ ప్రభావం కూడా కీలకం
దక్షిణ తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో పార్టీల కంటే అభ్యర్థుల ఎంపిక, రెబెల్స్ ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. టికెట్ దక్కని నాయకులు స్వతంత్రులుగా బరిలోకి దిగే పరిస్థితి అన్ని పార్టీలకూ తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
ఓట్లు చీలితే దాని లాభం ఎవరికి? నష్టం ఎవరికి? అన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టంగా మారింది.
ఈ ప్రాంతంలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ప్రత్యామ్నాయం ఎవరు? అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
