జగన్నాథుని సాన్నిధ్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆత్మీయ అనుభూతులు

జగన్నాథుని సాన్నిధ్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆత్మీయ అనుభూతులు

బాల్యం నుంచే జగన్నాథ భక్తి.. జీవితమంతా తోడుగా మహాప్రభువు

రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం నుంచి పూరీ దర్శనం వరకు దివ్యానుభూతి

శ్రీ జగన్నాథునికి అంకితమైన ఎన్నో ప్రార్థనలు, కీర్తనలు బాల్యం నుంచే నా జ్ఞాపకాలలో నిలిచిపోయాయి. పాఠశాల, కళాశాలలో చదువుతున్న రోజుల్లో మహాప్రభు జగన్నాథుని కీర్తిస్తూ భక్తితో పాటలు ఆలపిస్తూ ఆనందాన్ని పొందేదాన్ని. ఆ జగన్నాథునికి చాలా సన్నిహితంగా ఉన్నాననే భావన కలిగేది. ప్రస్తుతం ఆ కీర్తనలను పాడలేకపోయినా, నిత్యం జగన్నాథుని స్మరిస్తూ ఆయన సాన్నిధ్యాన్ని ప్రతి క్షణం అనుభూతి చెందుతుంటాను. కష్ట సమయాల్లో ఆయన నాకు అండగా నిలిచారని నా విశ్వాసం.

భక్తకవి మధుసూదన రావు రచించిన ఈ గీతాన్ని నేను ఇప్పటికీ స్మరిస్తూ ఉంటాను. “మహాప్రభువు అన్నివేళలా నాతోనే ఉంటారు” అనే ఆ భావనతో జగన్నాథుని నా హృదయంలో ఎల్లప్పుడూ ఆరాధిస్తుంటాను.

ప్రాపంచిక విషయాలను అర్థం చేసుకునే వయసుకు వచ్చేసరికి మహాప్రభు జగన్నాథుని గొప్పతనం నాకు తెలిసింది. ఇంట్లో, గ్రామంలో జగన్నాథుని గురించి తరచూ చర్చలు జరిగేవి. నేను గ్రామంలోని పాఠశాలలో చదువుతున్నప్పుడు భక్త సలాబేగ రచించిన “ఆహే నీల శైల” ప్రార్థనను క్రమం తప్పకుండా పఠించేదాన్ని.

మా ఉపాధ్యాయులు మహాప్రభు జగన్నాథుని గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. పూరీలోని ఆలయం అద్భుతమైన వైభవానికి ప్రతీక అని, అక్కడ జగన్నాథుడు, ఆయన సోదరి సుభద్ర, అన్నయ్య బలభద్రులను కలిసి ఆరాధిస్తారని వివరించేవారు. జగన్నాథుడు నల్లని ఛాయతో, గుండ్రని కళ్లతో ఉంటారని, సుభద్ర పసుపు వర్ణంలో, బలభద్రుడు వెన్నెలవంటి తెల్లని కాంతితో దర్శనమిస్తారని చెప్పేవారు. ఒకసారి ఆ దేవతామూర్తులను చూస్తే ఎప్పటికీ మరచిపోలేమని చెప్పేవారు.

తరువాత నాకు భువనేశ్వర్, కోణార్క్‌లను సందర్శించే అవకాశం లభించింది. మహాప్రభు జగన్నాథుని మొదటి దర్శనం నా మదిలో ఇప్పటికీ స్పష్టంగా నిలిచిపోయింది. ఎంత అద్భుతమైన ఆలయం, ఎంతటి తేజోవంతమైన దైవాలు! ఆ అనుభూతిని ఎప్పటికీ మరచిపోలేను.

మహాప్రభు జగన్నాథుని రథయాత్ర వైభవాన్ని ఎవరైనా మరచిపోగలరా? శ్రీక్షేత్రంలో సంవత్సరంలోని 12 నెలల్లో 13 ఉత్సవాలు జరుగుతాయని చెబుతారు. అయితే రథయాత్ర అద్వితీయమైన మహోత్సవం. ఏడాదంతా భక్తులు ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ సంవత్సరానికి ఒకసారి మహాప్రభువు స్వయంగా ఆలయం విడిచి గుండిచా ఆలయానికి వెళ్లి తన భక్తులకు దర్శనం ఇస్తారు. మూడు అద్భుతమైన రథాలపై చక్రరాజ సుదర్శనునితో కలిసి ముగ్గురు దేవతామూర్తులు గుండిచా ఆలయానికి చేరుకుని ఏడు రోజుల పాటు అక్కడ ఉంటారు.

బాల్యం నుంచే నేను మహాప్రభు జగన్నాథుని భక్తురాలిని. నా జీవితంలోని ఒడిదుడుకులు, సుఖదుఃఖాలు, కష్టాలు అన్నింటిలోనూ ఆయనే నాకు ఆధారం. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ కష్టాలన్నింటి నుంచి జగన్నాథుడే నన్ను బయటపడేశారని నేను విశ్వసిస్తాను. ఎందుకంటే నేను ఆయన కుమార్తెనే కదా.

భారత రాష్ట్రపతి పదవికి నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు భక్తిశ్రద్ధలతో జగన్నాథుని స్మరిస్తూ, “మీరు నన్ను ఇంతటి ఉన్నత శిఖరాలకు చేర్చారు” అని ప్రార్థించాను. ఆయన ఆశీస్సులు నాపై కురిపించారని భావించాను. పూర్తి ఆత్మవిశ్వాసంతో నా నామినేషన్ దాఖలు చేశాను. ఎన్నికల ప్రచారంలో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాను.

2022 జూలై 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పార్లమెంట్ సెంట్రల్ హాలుకు వెళ్లే దారిలో కూడా జగన్నాథునినే ప్రార్థించాను. ఆయన ఆశీర్వాదంతో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాష్ట్రపతిగా నా ప్రారంభోపన్యాసం సమయంలో కూడా ఆయన నాతోనే ఉన్నట్లుగా అనిపించింది.

అయినప్పటికీ, జగన్నాథుని దర్శనం కోసం పూరీ వెళ్లాలనే తపన నా హృదయంలో కొనసాగింది. రోజులు గడిచినా ఆ అవకాశం రాలేదు. ఆయన అనుగ్రహిస్తే తప్ప ఎవరికీ ఆయన దర్శనం లభించదని నేను నమ్మాను.

మౌనంగా ఆయనను ఇలా ప్రార్థించాను. “మహాప్రభూ, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. దయచేసి నన్ను పూరీకి పిలిచి మీ దర్శనం ప్రసాదించండి.” నా భావాలను మహాప్రభువు తప్పకుండా అర్థం చేసుకుంటారని విశ్వసించాను.

త్వరలోనే పూరీ పర్యటన ఖరారైంది. తేదీ నవంబర్ 10, 2022. పూరీ చేరుకుని వాహనశ్రేణి శ్రీమందిరం వైపు సాగుతుండగా, బడా దండా వద్దకు చేరుకున్న క్షణంలో ఒక అసాధారణమైన అనుభూతి నన్ను ఆవరించింది.

నా దృష్టి అంతా జగన్నాథునిపైనే ఉంది. దారికి ఇరువైపులా నిలిచిన పిల్లలు, మహిళలు, యువకులు, వృద్ధులకు నమస్కరిస్తూ ముందుకు సాగాను. ఆలయ సింహద్వారం వద్దకు చేరుకున్న వెంటనే నేను భావోద్వేగానికి లోనయ్యాను. నన్ను నేను మరిచిపోయి పవిత్రమైన బడా దండా రహదారిపై ఉన్న దుమ్ములోనే సాష్టాంగ నమస్కారం చేసి జగన్నాథునికి నా వినయపూర్వక నమస్కారాలు సమర్పించాను.

ఆ తర్వాత ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడిలో నలుగురు దేవతలను దర్శించుకున్న క్షణంలో దివ్యానందంతో పొంగిపోయాను.

మహాప్రభువు విశ్వానికి రక్షకుడు. అందరిచేత విడిచిపెట్టబడిన వారికి ఆశ్రయం ఇచ్చే దైవం ఆయనే. యావత్ ప్రపంచ ప్రజల దుఃఖాలను తొలగించేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకే ఆయన గుండ్రని కనుపాపలు ఎన్నడూ రెప్పవేయవని భక్తులు విశ్వసిస్తారు. ఆయన దృష్టిలో ఉన్నత–నీచ భేదాలు లేవు.

– ద్రౌపదీ ముర్ము, భారత రాష్ట్రపతి