విద్యార్థులకు శుభవార్త.. ఓపెన్ వర్సిటీలో కొత్త కోర్సులు
- అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఐదు కొత్త కోర్సులు
- యూజీసీ ఆమోదం.. త్వరలో ప్రవేశాల ప్రకటన
- ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల పెంపునకు ప్రత్యేక కోర్సులు
- వివరాలు వెల్లడించిన వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కొత్తగా ఐదు కోర్సుల నిర్వహణకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతి లభించింది. వృత్తిపరమైన, విద్యా రంగాల్లో అధిక డిమాండ్ ఉన్న ఈ కోర్సులకు యూజీసీ (University Grants Commission) ఆమోదం తెలిపినట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. కొత్తగా అనుమతి పొందిన కోర్సుల్లో ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్–స్కూల్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఎస్సీ జాగ్రఫీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు ఉన్నట్లు తెలిపారు.
వర్సిటీ వసతుల పరిశీలన తర్వాతే ఆమోదం..
యూజీసీ నిపుణుల కమిటీ జూన్లో వర్చువల్ విధానంలో విశ్వవిద్యాలయాన్ని తనిఖీ చేసిందని ప్రొ. ఘంటా చక్రపాణి తెలిపారు. వర్సిటీలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది, విద్యా ప్రమాణాలతో పాటు ఇతర అంశాలను పరిశీలించిన అనంతరమే కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కోర్సులకు అనుమతులు రావడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉందన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఓపెన్, దూరవిద్య విధానంలో ప్రత్యేక వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా సూచనల మేరకు కోర్సులను రూపొందించినట్లు వివరించారు.
ఉపాధ్యాయులకు మరింత ఉపయోగం
ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ అర్హతలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు ఉపయోగపడతాయని వీసీ తెలిపారు. పాఠశాల పరిపాలనలో శిక్షణ పొందడంతో పాటు విధి నిర్వహణలో వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ కోర్సులు దోహదపడతాయని చెప్పారు.
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించే అంశంపై త్వరలోనే విద్యాశాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, జాగ్రఫీలో ఎంఎస్సీ కోర్సులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
త్వరలో ప్రవేశాల ప్రకటన
కొత్తగా యూజీసీ ఆమోదం పొందిన ఐదు కోర్సులకు సంబంధించిన కనీస అర్హతలు, ప్రవేశ విధానం, రుసుములు, కోర్సు వ్యవధి, అధ్యయన కేంద్రాల వివరాలతో త్వరలోనే విశ్వవిద్యాలయం ప్రవేశాల ప్రకటన విడుదల చేయనున్నట్లు ప్రొ. ఘంటా చక్రపాణి తెలిపారు. తాజా సమాచారం కోసం విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లను సందర్శించాలని, సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
