పాలమూరు–రంగారెడ్డిపై త్వరలో శుభవార్త

  • 90 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతులే లక్ష్యం
  • కేంద్రం, ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా ప్రయత్నాలు
  • పాలమూరును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్‌రెడ్డి

ఆంధ్రప్రభ, మహబూబ్‌నగర్ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి త్వరలోనే శుభవార్త వినబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకం కింద 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి అవసరమైన అనుమతులు సాధించే దిశగా ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. దిండి పథకానికి 30 టీఎంసీల నీటి కేటాయింపులపైనా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.

మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ తయారీ విభాగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్లాంట్‌ను పరిశీలించి, అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

కృష్ణా ప్రాజెక్టుల సమస్యలకు పరిష్కారం

కృష్ణా పరివాహక ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న దిండి, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు, వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు పొరుగు రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం తెలిపారు.

‘‘ఈ ప్రాజెక్టులకు సంపూర్ణ అనుమతులు సాధించి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే. నేను పాలమూరు జిల్లా బిడ్డను. అత్యంత వెనుకబడిన ఈ జిల్లాను అభివృద్ధి చెందిన ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుకుందాం’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

పాలమూరు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం

విద్య, నీటిపారుదల, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చెప్పారు. పాలమూరు జిల్లాకు ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్ కళాశాలలు, యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అధునాతన సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలు అమలు చేసిన పెట్టుబడి విధానాల్లో ప్రజాప్రయోజనాలకు అనుకూలంగా ఉన్న వాటిని కొనసాగిస్తూ మరింత మెరుగైన విధానాలను తీసుకొచ్చామని చెప్పారు. తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, పర్యాటకం, ఇంధనం, వైద్యం, క్రీడా రంగాలకు ప్రత్యేక విధానాలు రూపొందించామని వివరించారు.

స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి

పాలమూరు పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంతో మంది రైతులు తమ భూములు ఇచ్చారని సీఎం గుర్తుచేశారు. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో అత్యధిక ఉద్యోగాలు స్థానిక యువతకే కల్పించాలని పారిశ్రామిక సంస్థలను కోరారు. పాలమూరు ప్రజలను అక్కున చేర్చుకుని వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అమర రాజా యాజమాన్యానికి సూచించారు.

విద్యుత్ వాహనాలదే భవిష్యత్తు

వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఎల్‌నినో ప్రభావంతో రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందని రేవంత్‌రెడ్డి అన్నారు. కాలుష్య రహిత దేశ నిర్మాణానికి వాహన కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలని చెప్పారు.

విద్యుత్ వాహనాల బ్యాటరీలకు ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో అమర రాజా భారీ సామర్థ్యంతో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. సంస్థలో పనిచేస్తున్న 700 మంది ఉద్యోగుల్లో 400 మంది మహిళలు ఉండటం గర్వకారణమని ప్రశంసించారు.

చైనాతో పోటీ పడే స్థాయికి అమర రాజా

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాలు, బ్యాటరీల రంగంలో చైనా ఆధిపత్యం కొనసాగుతోందని సీఎం పేర్కొన్నారు. అలాంటి దేశంతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్న అమర రాజా సంస్థను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. స్థానిక ప్రతిభతో ప్రపంచస్థాయి సంస్థలతో పోటీ పడుతున్న అమర రాజా తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో కీలక భాగస్వామిగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అమర రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్, ఎంపీ డీకే అరుణ, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, అధికారులు పాల్గొన్నారు.