Gold prices India | డాలర్లను తినేస్తున్న బంగారం దిగుమతులు

Gold prices India | డాలర్లను తినేస్తున్న బంగారం దిగుమతులు
Gold prices India | సుంకాల పెంపుతో సామాన్యుడిపై భారీ భారం
‘డెడ్ ఇన్వెస్ట్మెంట్’గా బంగారంపై కేంద్రం వాదన
స్మగ్లింగ్ ముప్పుతో జ్యువెలరీ రంగంలో ఆందోళన
సుంకాలు కాదు… వ్యవస్థాగత మార్పులే పరిష్కారం
Gold prices India | భారతీయ సమాజంలో బంగారం కేవలం ఒక లోహం కాదు.. అదొక సెంటిమెంట్, సంస్కృతి, సంపదకు ప్రతీక. వివాహాలు, పండుగలే కాదు.. ఆపద కాలంలో ఆదుకునే ఏకైక నమ్మకమైన ఆస్తిగా పసిడిని భారతీయులు తరతరాలుగా కొలుస్తున్నారు. అయితే, అదే బంగారం ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యగా మారుతుందని ఎవరూ ఊహించలేదు.
విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారు దిగుమతులపై సుంకాన్ని శాతం నుండి 15 శాతానికి పెంచుతూ తీసుకున్న సంచలన నిర్ణయం దేశీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. మొన్నటి వరకు “సురక్షితమైన పెట్టుబడి”గా ప్రశంసలు పొందిన పసిడిని, నేడు ప్రభుత్వం హఠాత్తుగా ‘డెడ్ ఇన్వెస్ట్మెంట్‘ అని ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఈ సుంకాల పెంపు వెనుక ఉన్న వ్యూహాత్మక లక్ష్యాలు ఏమిటి? దీనివల్ల సామాన్య వినియోగదారుడిపై పడే పన్నుల భారం ఎంత? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
1. డాలర్లను తినేసే మెషిన్ బంగారం
భారతదేశం తన బంగారం అవసరాలలో దాదాపు 90 శాతం పైగా విదేశీ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. ఆర్థిక సంవత్సరం 2025-26 గణాంకాలను పరిశీలిస్తే, దేశీయంగా బంగారం పరిమాణం పరంగా దిగుమతులు 4.76 శాతం తగ్గినప్పటికీ, అంతర్జాతీయంగా పసిడి ధరలు విపరీతంగా పెరగడం వల్ల దిగుమతుల వ్యయం ఏకంగా 24 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 6.75 లక్షల కోట్లు) చేరింది.
మన దేశ రక్షణ బడ్జెట్‌తో దాదాపు సమానంగా పసిడి దిగుమతులకు ఖర్చు చేయడం దేశ ఆర్థిక సమతుల్యతను దెబ్బతీస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో బంగారం కొనుగోళ్లకు ‘అమెరికన్ డాలర్ల’ రూపంలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దేశంలో బంగారం డిమాండ్ పెరిగే కొద్దీ, డాలర్లకు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ అంతకంతకూ పతనమవుతుంది. ఈ నేపథ్యంలోనే నిపుణులు బంగారాన్ని ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ‘డాలర్లను తినేసే మెషిన్‘ గా అభివర్ణిస్తున్నారు.
2. కస్టమర్లపై సుంకాల భారం
కేంద్ర ప్రభుత్వం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను 5 శాతానికి పెంచడం ద్వారా మొత్తం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి చేర్చింది. బడ్జెట్ 2024లో ఈ సుంకాన్ని 6 శాతానికి తగ్గించిన ప్రభుత్వం, మళ్లీ పాత నిర్ణయానికే రావడం గమనించాల్సిన అంశం.
ఈ 15 శాతం సుంకం వల్ల సామాన్య కస్టమర్లపై పన్నుల భారం భారీగా పెరిగింది. గతంలో 6 శాతం సుంకం ఉన్నప్పుడు ప్రతి రూ.1 లక్ష విలువైన బంగారంపై రూ.6,000 పన్ను ఉండగా, ఇప్పుడది రూ.15,000కి చేరి నేరుగా రూ.9,000 అదనపు భారాన్ని మోపింది. ఈ సుంకం పెంపు ప్రకటించిన వెంటనే దేశీయ మార్కెట్లలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.14,000 వరకు పెరిగింది.

మధ్యతరగతి వివాహాలలో కనీసం 10 తులాల (100 గ్రాములు) బంగారం కొనడం ఒక సంప్రదాయం. ఇప్పుడు పెరిగిన 15 శాతం సుంకం, 3 శాతం జీఎస్టీలతో కలిపి కేవలం పన్నుల రూపంలోనే వినియోగదారులు రూ.1,45,800 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,000 మార్కును తాకగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,53,900 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, మిడిల్ ఈస్ట్ సంక్షోభం ఇలాగే కొనసాగితే, త్వరలోనే తులం బంగారం ధర రెండు లక్షల రూపాయలకు చేరుకుంటుందనే మార్కెట్ అంచనాలు సామాన్య కొనుగోలుదారులను వణికిస్తున్నాయి.
3. కేంద్రం ‘డెడ్ ఇన్వెస్ట్మెంట్’ వాదన
ప్రభుత్వం బంగారాన్ని ఉత్పాదకత లేని ‘డెడ్ ఇన్వెస్ట్మెంట్‘గా పేర్కొనడం వెనుక బలమైన ఆర్థిక తర్కం ఉంది. ప్రజలు కొనే భౌతిక బంగారం లాకర్లలోనే మురిగిపోతుంది తప్ప, దేశంలో పరిశ్రమల స్థాపనకో లేదా మౌలిక వసతుల కల్పనకో ఉపయోగపడదు. అదే డబ్బు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్యాంకు డిపాజిట్లలో పెడితే పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందనేది ప్రభుత్వ వాదన.
అయితే, సామాన్య, గ్రామీణ ప్రజల కోణంలో చూస్తే ఈ విశ్లేషణ క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ పడిపోతున్న తరుణంలో బంగారం ఎప్పుడూ నమ్మకమైన ఆర్థిక రక్షణ కవచంగా నిలుస్తుంది. ముఖ్యంగా, బ్యాంకులు లేదా షేర్ మార్కెట్లతో పోలిస్తే బంగారానికి ఉన్న ‘లిక్విడిటీ’ (తక్షణమే నగదుగా మార్చుకునే సదుపాయం) సాటిలేనిది. అర్ధరాత్రి ఆపద వచ్చినా దీనిని తాకట్టు పెట్టి నిమిషాల్లో డబ్బు పొందే వీలుంది. ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో వీటికి సంబంధించిన అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల, భద్రత, తక్షణ అవసరాల కోసం పసిడిని ఆశ్రయించే సామాన్యుడిపై పన్నుల భారం మోపి, దానిని ఉత్పాదకత లేని పెట్టుబడిగా కొట్టిపారేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
పొంచి ఉన్న స్మగ్లింగ్ ముప్పు!
బంగారం దిగుమతి సుంకం 15 శాతం, 3 శాతం జీఎస్టీ కలిపి మొత్తం 18 శాతం పన్ను భారం కావడం వల్ల దేశంలో సమాంతర బ్లాక్ మార్కెట్, అక్రమ స్మగ్లింగ్ విపరీతంగా ఊపందుకునే ప్రమాదం ఉంది. ల్యాండెడ్ కాస్ట్ భారీగా పెరగడంతో, పన్నులు ఎగవేసేందుకు బిల్లులు లేకుండా అక్రమ మార్గాల్లో బంగారాన్ని తెచ్చి విక్రయించే గ్రే మార్కెట్ విస్తరిస్తుంది. ఇది ఒకవైపు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుండగా, మరోవైపు దేశంలో కఠినంగా సంపాదించిన నిధులను నల్లధనంగా మార్చే అక్రమ ఆర్థిక వలయానికి దారితీస్తుంది.
ఈ పరిణామాలు దేశీయంగా మిలియన్ల మందికి జీవనోపాధి కల్పిస్తున్న జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడంతో మార్కెట్లో కొనుగోళ్ల డిమాండ్ పడిపోయి, క్రమంగా చిన్న, మధ్యతరహా జ్యువెలరీ దుకాణాలు మూతపడే పరిస్థితి వస్తుంది. దీనివల్ల తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకున్న లక్షలాది మంది స్థానిక స్వర్ణకారులు, కళాకారులు, అనుబంధ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉంది.
నియంత్రణ కాదు… వ్యవస్థాగత మార్పు కావాలి
విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌ను అదుపు చేయడం, రూపాయి విలువను స్థిరీకరించడం అనేవి స్థూల ఆర్థిక వ్యవస్థ పరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయాలే కావచ్చు. కానీ, పన్నులను 15 శాతానికి పెంచడం ద్వారా మాత్రమే భారతీయుల పసిడి వ్యామోహాన్ని తగ్గించలేరు.
ప్రభుత్వం కేవలం సుంకాలతో కస్టమర్లను ‘షాక్‘కి గురిచేయడం కాకుండా, భారతీయ కుటుంబాల దగ్గర నిరుపయోగంగా ఉన్న సుమారు 24,000 టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లను మరింత ఆకర్షణీయంగా మార్చాలి. ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంచి, బంగారంపై పెట్టే పెట్టుబడులను సురక్షితమైన బాండ్లు, ఈక్విటీల వైపు మళ్లించినప్పుడే ‘ఎల్లో మెటల్ సంక్షోభానికి‘ శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అప్పటి వరకు, సామాన్యుడికి బంగారం చేదు నిజంగానే మిగిలిపోతుంది.
- మేకల క్రిష్ణ
9948556978
