వేద విద్యా పరిరక్షణ.. విద్యార్థుల సంక్షమానికి ప్రాధాన్యం..
దేవస్థానం వేదపాఠశాలను సందర్శించిన ఈవో వి.కె. శీనా నాయక్
విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, బోధన విధానంపై క్షేత్రస్థాయిలో పరిశీలన
వేదపాఠశాల ఆవరణలో బిల్వం, మారేడు, నేరేడు వంటి దేవతా వృక్షాలు
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి..
వైద్య బృందంతో ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ
(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్ బుధవారం సాయంత్రం దేవస్థానం వేదపాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన విధానం, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల విద్యాభ్యాసం, వసతి, ఇతర సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా వేదపాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకలైన బిల్వం, మారేడు, నేరేడు వంటి దేవతా వృక్షాలను ఈవో నాటారు.

పచ్చదనం పెంపొందించడంతో పాటు దేవతా వృక్షాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈవో ఆదేశాల మేరకు దేవస్థానం వైద్య బృందం వేదపాఠశాలను సందర్శించి విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన మందులను పంపిణీ చేసింది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు శ్రీనివాస శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమాదేవి, దేవస్థానం అధికారులు, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.

