దేశ నిర్మాణంలో కేఎల్ రావు పాత్ర అనన్యసామాన్యం..
జలయజ్ఞంతోనే కేఎల్ రావు ఆకాంక్షలను సాకారం చేసిన వైఎస్సార్
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
(విజయవాడ ఆంధ్రప్రభ) : భారతదేశంలో అతిపెద్ద, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కేఎల్ రావు పోషించిన పాత్ర అద్వితీయమని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. డాక్టర్ కేఎల్ రావు జయంతిని పురస్కరించుకుని విజయవాడ పాత బస్టాండ్ కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మల్లాది విష్ణు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ నీటిపారుదల రంగానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి కేఎల్ రావు అని కొనియాడారు.
నాటి ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ వంటి ముగ్గురు గొప్ప నాయకుల వద్ద కేంద్ర నీటిపారుదల, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసే అరుదైన అవకాశం ఆయనకు దక్కిందని మల్లాది విష్ణు గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల వరప్రదాయని అయిన నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి బహుళార్థసాధక ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణంలో కేఎల్ రావు ప్రధాన పాత్ర పోషించారని, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రగతికి ఎలా ఉపయోగించాలో ఆయన ప్రపంచానికి చూపించారని కొనియాడారు. కేఎల్ రావు ఆశయాలకు అనుగుణంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి భగీరథ ప్రయత్నం చేశారని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ప్రతి ఎకరాకూ నీరు అందించాలనే సంకల్పంతో వైఎస్సార్ ప్రతిష్టాత్మకంగా జలయజ్ఞం కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తుచేశారు.

కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, తెలంగాణ ప్రాంతాల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చేందుకు వైఎస్సార్ అనేక కీలక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. పోలవరం, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, దేవాదుల వంటి భారీ ప్రాజెక్టుల పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి, వెనుకబడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు నిరంతరం శ్రమించారని వివరించారు. కేవలం ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా, రైతాంగాన్ని ఆదుకోవడానికి వైఎస్సార్ అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి, కోట్లాది మంది రైతులకు కొండంత అండగా నిలిచారని, పాత విద్యుత్ బకాయిలను రద్దు చేసి రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించారని చెప్పారు.
ఉచిత నాణ్యమైన విద్యుత్‌తో పాటు ఉచిత విత్తనాలు, ఎరువుల పంపిణీని ముమ్మరం చేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించడంతో పాటు, వడ్డీ లేని రుణాలను ప్రవేశపెట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తుచేశారు. డాక్టర్ కేఎల్ రావు నిర్మించిన ప్రాజెక్టుల పునాదులపై, వైఎస్సార్ తన ‘జలయజ్ఞం’ ద్వారా అపర భగీరథుడిలా నీటిని పారించి లక్షలాది ఎకరాలను పచ్చటి పసిడి పంటలుగా మార్చారని మల్లాది విష్ణు కొనియాడారు. ఈ కార్యక్రమంలో దమ్మాల చంద్రశేఖర్, గుడిసె శ్యాము బాబు, గుండె సుందర్ పాల్, వరలక్ష్మి, యర్రంశెట్టి అంజిబాబు , వెన్నం రత్నారావు, భోగాది మురళి, నిరీక్షణ, మల్లిక్, పిల్లుట్ల వంశీ, పసుపులేటి కోటేశ్వరరావు, పేరూరు ప్రేమ్ కుమార్ వైసీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
